Homeఆంధ్రప్రదేశ్‌Margadarsi: మార్గదర్శి.. డబ్బులు ఇచ్చినా కష్టమే కదా?

Margadarsi: మార్గదర్శి.. డబ్బులు ఇచ్చినా కష్టమే కదా?

Margadarsi: అన్నదాత మూతపడింది. సితార మరుగున పడింది. విపుల, చతుర, బాల భారతం కాలగర్భంలో కలిసిపోయాయి. డాల్ఫిన్స్ నష్టాల్లో ఉంది. రామోజీ ఫిలిం సిటీ లో రిలయన్స్ కు వాటా ఉంది.. ఈనాడు టారిఫ్ తగ్గించుకుంది. నేడో, రేపో పూర్తి డిజిటల్ బాట పట్టనుంది. ఇక ఈటీవీ న్యూస్ బార్క్ రేటింగ్స్ లో ఎక్కడో చివరి స్థానంలో కొనసాగుతోంది. ఇక మిగిలిందల్లా బంగారు బాతు మార్గదర్శి. దాని చుట్టూ ఎన్నో కేసులు.. మరెన్నో ఇబ్బందులు.. ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. సానుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా ఉంటుందా అనేది పక్కన పెడితే.. ఇప్పటికైతే మార్గదర్శి పూర్వ స్థాయిలో పనిచేయడం లేదనేది మాత్రం వాస్తవం. ఇన్ని ప్రతిబంధకాలు ఎదుర్కొంటున్న రామోజీరావుకు తాజాగా మార్గదర్శి విషయంలో మరో చిక్కుముడి వచ్చి పడింది.

మార్గదర్శి కి సంబంధించి చెల్లింపులు చిన్నస్థాయి లో అయితే నగదు స్వీకరిస్తారు. భారీ మొత్తంలో అయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ రూపంలో తీసుకుంటారు. అయితే ఇటీవల మార్గదర్శి విషయంలో కొన్ని నిబంధనలు సడలించినట్లు కనిపిస్తోంది. చిట్స్ వేసే వినియోగదారుల నుంచి చిన్నదైనా, పెద్దదైనా మొత్తం నగదు రూపంలోనే స్వీకరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇలా స్వీకరించిన నగదు మొత్తాన్ని మార్గదర్శి కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. ఆ కేంద్ర కార్యాలయం హైదరాబాదులో ఉంది. అయితే ఇటీవల చిట్స్ వేసే సభ్యుల నుంచి స్వీకరించిన నగదు దాదాపు 50 లక్షల ను మార్గదర్శి సిబ్బంది తీసుకెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఒక వ్యక్తి 50 వేల కంటే మించి నగదు తీసుకెళ్లడానికి లేదు. అందువల్ల ఎన్నికల అధికారులు, పోలీసులు ఆ నగదును పట్టుకున్నారు. ఐటీ అధికారుల సమక్షంలో సీజ్ చేశారు. అంటే ఆ నగదును అధికారుల మధ్య ఉంచుకుంటారని కాదు.. పూర్తి ఆధారాలు చూపిస్తే ఇచ్చేస్తారు.

ఇలాంటి అప్పుడు మార్గదర్శి యాజమాన్యం ఫలానా వ్యక్తులు డబ్బులు ఇచ్చారు.. వాటిని మేము చిట్స్ రూపంలో స్వీకరించాం అని అధికారులకు చెప్పొచ్చు. ఆ చిట్స్ వేసే సభ్యుల వివరాలు మొత్తం ఇవ్వొచ్చు. కానీ ఒక్కసారి ఆ జాబితా ఇచ్చిన తర్వాత సదరు సభ్యుల గురించి అధికారులు ఆరా తీస్తారు. వారికి ఏ రూపంలో ఆదాయం వచ్చిందో అడుగుతారు. ఆ నగదు సక్రమ మార్గంలో వచ్చి ఉంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఆ నగదు అక్రమ మార్గంలో వస్తేనే అసలు ఇబ్బంది. అప్పుడు ఇచ్చినవారు, పుచ్చుకున్నవారు ఇబ్బంది పడక తప్పదు. ఒకవేళ ఆ చిట్స్ వేసిన సభ్యులకు వచ్చిన నగదు పన్ను పరిధిలో లేకుంటే మరిన్ని చిక్కులు ఎదురవుతాయి. అప్పుడు ఇచ్చినవారు, పుచ్చుకున్న వారు కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. సో మొత్తానికి ఎపిసోడ్ ద్వారా మార్గదర్శిలో చిట్స్ వేసిన కష్టమే కదా అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమౌతోంది. మరి ఈ సమస్య నివారణకు రామోజీరావు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. అంతటి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇబ్బంది పెట్టినప్పుడే రామోజీరావుకు ఏమీ కాలేదని.. ఈ చిన్న సమస్యను పరిష్కరించుకోవడం ఆయనకు ఒక లెక్కా అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version