Margadarshi Case : మార్గదర్శి కేసు.. రామోజీరావుకు షాక్.. జూలై 5న విచారణకు హాజరుకావాలని సీఐడీ నోటీసులు

ఈనాడులో ప్రచురితమైన కథనం జగన్ లో కలవరపాటుకు గురిచేసింది. అందుకే ఎలాగైనా రామోజీరావును గాడిలో పెట్టాలని సీఐడీ నోటీసులిప్పించినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ విచారణపై రామోజీరావు కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్టు టాక్ నడుస్తోంది.

Written By: Dharma, Updated On : June 22, 2023 3:22 pm
Follow us on

Margadarshi Case : రాజగురువు రామోజీరావుకు మరో షాక్. జూలై 5న విచారణకు హాజరుకావాలని ఏపీ సీఐడీ నోటీసులిచ్చింది. మార్గదర్శి చైర్మన్ గా ఉన్న రామోజీరావుతో పాటు ఎండీ శైలజా కిరణ్ లకు సైతం నోటీసులు అందించింది. విచారణకు తప్పకుండా హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. మార్గదర్శిలో అవకతవకలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రామోజీరావుతో పాటు శైలజా కిరణ్ పై సీఐడీ కేసులు నమోదుచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు సైతం జరిగాయి. విచారణ సైతం కొనసాగుతోంది. ఏకంగా రామోజీరావు ఇంటి వెళ్లి మరీ విచారణ జరిపారు. ఎండీ శైలజా కిరణ్ ను సైతం ప్రశ్నల వర్షం కురిపించారు.
మార్గదర్శి వ్యవహారంలో ఎలాగైనా రామోజీరావును దోషిగా నిలబెట్టాలని జగన్ సర్కారు పావులు కదుపుతోంది. దీనిని ఎలాగైనా ఎదుర్కొనాలని రామోజీరావు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం న్యాయ విచారణ సైతం కొనసాగుతోంది. దీంతో మార్గదర్శిలో అణువణువునా శూలశోధన చేసి అక్రమాలు బయటకు తీస్తున్నారు. తొలుత రూ.700 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. ఇటీవల మరో రూ.200 కోట్ల ఆస్తులను జప్తుచేశారు. సీఐడీ చర్యలతో రామోజీరావు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయినా ఎక్కడా వెనక్కి తగ్గిన దాఖలాలు కనిపించడం లేదు. తన అనుకూల మీడియా ద్వారా నేరుగా సీఐడీపైనే అస్త్రాలను ఎక్కుపెట్టారు వ్యతిరేక కథనాలు వండి వార్చారు.
ఇటీవలే సీఐడీ చీఫ్ సంజయ్ ప్రెస్ మీట్ పెట్టారు. మార్గదర్శి చందాల సేకరణలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. మార్గదర్శిలో పూర్తిస్థాయి అవకతవకలను బయటకు తీస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంతులేని అక్రమాలు జరిగాయని.. వడ్డీ ఆశచూపి చందాదారుల నుంచి డిపాజిట్లు సేకరించారని.. ఆధారాలతో సహా మార్గదర్శి అవకతవకలు బయటపెడతామని చెప్పారు. అక్కడకు రోజు వ్యవధిలోనే విచారణకు హాజరుకావాలని రామోజీరావుతో పాటు శైలజా కిరణ్ లకు నోటీసులు అందించారు. దీంతో ఇది ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. గతసారి రామోజీరావు, శైలజా కిరణ్ ను వారి వారి ఇళ్లలోనే విచారణ జరిపారు. మార్గదర్శికి సంబంధించి కీలక సమాచారాన్ని రాబెట్టారు.
అయితే ఇప్పుడు నేరుగా సీఐడీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని నోటీసులివ్వడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కానీ విచారణకు రామోజీరావు హాజరవుతారా? లేదా? అన్నది చర్చ నడుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో రామోజీరావుపై పట్టు బిగించాలని జగన్ చూస్తున్నారు. ఈ కేసు ద్వారానైనా తన విషయంలో వెనక్కితగ్గుతారని భావిస్తున్నారు. కానీ ఎక్కడా వెనక్కి తగ్గిన దాఖలాలు లేవు. అనంతపురంలో లేపాక్షి భూముల విషయంలో ఈనాడులో ప్రచురితమైన కథనం జగన్ లో కలవరపాటుకు గురిచేసింది. అందుకే ఎలాగైనా రామోజీరావును గాడిలో పెట్టాలని సీఐడీ నోటీసులిప్పించినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ విచారణపై రామోజీరావు కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్టు టాక్ నడుస్తోంది.