Homeట్రెండింగ్ న్యూస్Titanic Submersible Missing: సముద్రంలో అదృశ్యమైన జలాంతర్గామిలోని అపరకుబేరులు.. చివరి ఆశలు గల్లంతు

Titanic Submersible Missing: సముద్రంలో అదృశ్యమైన జలాంతర్గామిలోని అపరకుబేరులు.. చివరి ఆశలు గల్లంతు

Titanic Submersible: అట్లాంటిక్ మహాసముద్రంలో 12 వేల అడుగుల లోతులోని టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన ఐదుగురు పర్యాటకులు అదృశ్యం అయ్యారు. వీరి జాడ కోసం ఎంత వెతుకుతున్న ఆచూకీ లభ్యం కావడం లేదు. ఈ ఐదుగురు పర్యాటకులతో ఆదివారం న్యూ ఫౌండ్ ల్యాండ్ నుంచి బయలుదేరిన మినీ జలాంతర్గామి టైటాన్ అకస్మాత్తుగా అదృశ్యమైంది. దీని జాడ కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్న ప్రయోజనం లేకుండా పోయింది. ప్రమాద ప్రాంత పరిసరాలను కెనడా, అమెరికా తీర రక్షక దళాలు జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికీ పెద్ద ఎత్తున గాలింపు చర్యలను ఆయా అధికారులు చేపడుతున్నారు. అయితే, ఎక్కడా కనీస ఆనవాళ్లు కూడా లభ్యం కావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు.

అట్లాంటిక్ మహా సముద్రంలో కొన్నాళ్ల కిందట ప్రమాదవశాత్తు కూలిపోయిన టైటానిక్ శకలాలను చూసేందుకు ఐదుగురు పర్యాటకులు వెళ్లారు. ఈ పర్యటనకు ప్రత్యేకంగా మినీ జలాంతర్గామిని ఏర్పాటు చేసుకున్నారు. దీనికి కూడా టైటాన్ అని పేరు పెట్టారు. ఆదివారం బయలుదేరిన ఈ జలాంతర్గామి ఒక్కసారిగా అదృశ్యమైంది. అయితే, ఈ ప్రమాదం జరిగి మూడు రోజులు దాటినా గాలింపు చర్యలు చేపడుతున్న అధికారులకు మాత్రం ఎటువంటి ఆనవాళ్లు లభ్యం కాలేదు. ఇందులోని ఆక్సిజన్ నిల్వలు గురువారం ఉదయానికల్లా అంతరించిపోతాయన్న అధికారుల హెచ్చరికలు నేపథ్యంలో ఏదో అద్భుతం జరిగితే తప్ప ప్రయాణికులు బతికి బయటపడటం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు.

పర్యటనకు వెళ్లిన వాళ్లు వీరే..

ఇక ఈ పర్యటనకు వెళ్లిన వారిలో పాకిస్థాన్ కు చెందిన బిలియనీర్ షేహజాద్ దావూద్ (48), ఆయన కుమారుడు సులేమాన్ (19), యూఏఈ లో ఉంటున్న బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఈ యాత్ర నిర్వాహకుడు, ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్, ఫ్రెంచ్ మాజీ నావిక దళ అధికారి పాల్ హెన్రీ ఈ జలాంతర్ఘామిలో ఉన్నారు. ఇప్పుడు వీరి ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులతోపాటు యావత్ ప్రపంచం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ పర్యటన కోసం ఈ వ్యాపారవేత్తలు భారీ మొత్తంలోనే ఖర్చు చేసి మరి వెళ్లారు. ఇంతలోనే ఇటువంటి దుర్ఘటన జరగడం ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది.

ముమ్మరంగా సాగుతున్న గాలింపు చర్యలు..

ఇక ఈ టైటాన్ జలాంతర్గామి కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు. కెనడా, అమెరికాకు చెందిన తీర రక్షక దళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. గడిచిన మూడు రోజుల నుంచి గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని ఈ రెండు దేశాలకు చెందిన అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే వెతుకుతున్నప్పటికీ కనీస ఆనవాళ్లు కూడా లభ్యం కాకపోవడంతో వీరి జాడ ఇప్పట్లో దొరికే అవకాశమే లేదన్న భావన అధికారుల్లో వ్యక్తం అవుతోంది. గురువారం ఉదయం నాటికి జలాంతర్గామిలో ఆక్సిజన్ నిల్వలు కూడా అంతరించిపోయే అవకాశం ఉండడంతో అధికారుల్లో ఉన్న చిన్న ఆశ కూడా ఇప్పుడు సన్నగిల్లిపోతోంది. వీరిని ప్రాణాలతో పట్టుకోవడం కష్టమేనన్న భావన అధికారుల్లోనూ వ్యక్తం అవుతోంది.

శబ్దాలను గుర్తించిన అధికారులు..

టైటాన్ అదృశ్యమైన ప్రాంతంలో గాలింపు చర్యలను చేపడుతున్న అధికారులకు కొన్ని రకాల శబ్దాలు వినిపిస్తున్నట్లు చెబుతున్నారు. కెనడాకు చెందిన పీ-8 నిఘా విమానం గాలింపు చర్యలను చేపడుతున్న సందర్భంలో నీటి అడుగు నుంచి వస్తున్న శబ్దాలను గుర్తించింది. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి పెద్ద ఎత్తున ఈ శబ్దాలు వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ శబ్దాలు జలాంతర్గామి నుంచి వస్తున్నవేనని అధికారులు భావిస్తున్నారు. ఈ సమాచారాన్ని అమెరికా నావికాదళంతోనూ పంచుకుంది కెనడా అధికారుల బృందం. మరిన్ని నౌకలను, నీటి అడుగున గాలింపు చర్యలు చేపట్టే సాధనాలను రంగంలోకి ఈ రెండు దేశాలకు చెందిన నావికాదళ రక్షక అధికారులు దించుతున్నారు. గురువారం కూడా ఆచూకీ లభ్యం కాకపోతే మాత్రం.. వీరి జాడను పట్టుకోవడం సాధ్యం కాదన్న భావనను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఈ పర్యాటకుల అదృష్టం ఏ విధంగా ఉందో.

Exit mobile version