Sajjala Ramakrishna Reddy: సజ్జల రామకృష్ణారెడ్డి పై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందా? ఆయన చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? ఆయనపై వరుస కేసులు నమోదు కానున్నాయా? అవసరమైతే అరెస్టు చేస్తారా? కేసు విచారణకు నోటీసులు ఇవ్వడం దేనికి సంకేతం? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో అన్ని తానై వ్యవహరించారు సజ్జల. అధినేత జగన్ తర్వాత అన్ని చక్కబెట్టారు. ప్రభుత్వంతో పాటు పార్టీలో కూడా యాక్టివ్ రోల్ ప్లే చేశారు. పార్టీలో నెంబర్ 2 గా ఎదిగారు. వైసీపీ హయాంలో జరిగిన ప్రతి నిర్ణయం వెనుక ఆయన ఉన్నారు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కీలక కేసుల్లో ఆయన ప్రమేయంపై ఆరా తీసింది ప్రభుత్వం. తాజాగా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రేపు కేసు విచారణకు రావాలంటూ మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిపై అనుమానాలు ఉన్నాయి. ఇదే కేసులో ఇప్పుడు ఆయనను విచారణకు పిలవడం విశేషం. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా.. చురుగ్గా పావులు కదిపారు పోలీసులు. అయితే చాలామంది వైసిపి ముఖ్య నేతలు ముందస్తు బెయిల్ కోసం ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారిపై తదుపరి చర్యలు తీసుకోకుండా న్యాయస్థానం ఆదేశాలు పొందారు. కానీ కేసు విచారణ మాత్రం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ యువజన నేత చైతన్య పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి సైతం పోలీసుల విచారణకు హాజరయ్యారు. తాజాగా సజ్జలకు నోటీసులు ఇవ్వడంతో కేసు కొత్త మలుపు తిరిగింది.
* ఎయిర్ పోర్టులో అడ్డుకున్న పోలీసులు
తాజాగా ఢిల్లీ ఎయిర్పోర్టులో సజ్జలకు లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై సైతం వివాదం నడుస్తోంది. విదేశాల నుంచి తిరిగి వస్తున్న సజ్జలను మంగళవారం ఢిల్లీ ఎయిర్పోర్ట్ పోలీసులు అడ్డుకోవడంతో తొలిసారి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. టిడిపి కేంద్రకార్యాలయం పై జరిగిన దాడికి సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి అని పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో తేలింది. దీంతో ఆయన పేరును జతచేస్తూ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులందరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సజ్జల విషయంలో సైతం నోటీసులు జారీ చేసినట్లు డిజిపి నిర్ధారించారు.
* కోర్టుకు వెళ్లే అవకాశం
రేపు తప్పకుండా సజ్జల హాజరవుతారని పోలీసులు భావిస్తున్నారు. ఒకవేళ వివిధ కారణాలు చెబుతూ సజ్జల హాజరు కాకుంటే మాత్రం.. తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. అయితే వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సజ్జల.. కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి