Lokesh Comments On CM Chandrababu: విశాఖ పెట్టుబడుల సదస్సుకు అన్ని రకాల సన్నాహాలు జరుగుతున్నాయి. ఓవైపు సీఎం చంద్రబాబు( CM Chandrababu), మరోవైపు మంత్రి నారా లోకేష్ దిగ్గజ పారిశ్రామిక వేత్తలను ఏపీకి ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. అందుకు అనుకూలమైన వాతావరణం ఉందని వారికి నమ్మకంగా చెబుతున్నారు. తాజాగా విశాఖలో జరగనున్న సిఐఐ సదస్సు కోసం బొంబాయిలో మంత్రి లోకేష్ రోడ్ షో చేశారు. ఈనెల 14న గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై కీలక అవగాహన ఒప్పందం జరుగుతుందని ప్రకటించారు. వచ్చే నెల నుంచి మిట్టల్ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం అవుతాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు సమర్థ నాయకత్వం వల్లే పెట్టుబడులు ఊపందుకున్నాయని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్. మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా విశాఖను తీర్చిదిద్దుతామని ప్రకటించారు మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా అక్కడ పారిశ్రామికవేత్తలకు ఏపీలో సమర్థ నాయకత్వం ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.
* చంద్రబాబు ట్రాక్ రికార్డ్..
ఏపీకి( Andhra Pradesh) భారీగా పెట్టుబడులు రావడానికి సీఎం చంద్రబాబు ట్రాక్ రికార్డ్ ప్రధాన కారణమని లోకేష్ అన్నారు. నాడు చంద్రబాబు సైబరాబాద్ నిర్మిస్తే.. ఇప్పుడు తెలంగాణకు పవర్ హౌస్ గా మారిన విషయాన్ని గుర్తించుకోవాలని కోరారు. విభజిత ఏపీలో వెనుకబడిన అనంతపురం జిల్లాకు కియా మోటార్ ఫ్యాక్టరీని తీసుకురావడంతో.. ఆ జిల్లా తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఆ నమ్మకంతోనే ఫార్చ్యూన్ 500 కంపెనీలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు విజన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు లోకేష్. అవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
* వందేళ్ళ ముందు చూపు..
వందేళ్ళ ముందు చూపు కలిగిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పుకొచ్చారు నారా లోకేష్. శంషాబాద్ ఎయిర్పోర్ట్( Shamshabad Airport) నిర్మించిన తీరును ప్రస్తావించారు. శంషాబాద్ తోపాటు బెంగళూరు ఎయిర్ పోర్టు ఒకేసారి నిర్మాణం జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ బెంగళూరు ఎయిర్ పోర్ట్ అక్కడి అవసరాలకు చాలడం లేదన్నారు. కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ విషయంలో అలా కాదని.. వందేళ్ల వరకు అవసరాలు తీర్చగల విధంగా ఎయిర్పోర్ట్ ను రూపొందించిన విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. అది ముమ్మాటికి విజన్ అన్నారు. ముందున్న ప్రభుత్వాలు అభివృద్ధిని కొనసాగిస్తాయని చెప్పుకొచ్చారు. నాడు హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు శ్రీకారం చుడితే.. తరువాత వచ్చిన వైయస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కెసిఆర్ కొనసాగించారని చెప్పారు. కానీ ఏపీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి అలా వ్యవహరించలేదని విమర్శించారు. ప్రస్తుతం లోకేష్ ముంబైలో చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.