Yatra 2: సినిమా కోసం శాసనసభ సమావేశాలు వాయిదా?

మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన యాత్ర సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఇప్పుడు పార్ట్ 2 లో మాత్రం జగన్ పాత్రలో తమిళ యువనటుడు జీవ మెప్పించారు.

Written By: Dharma, Updated On : February 8, 2024 3:47 pm
Follow us on

Yatra 2: వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రం యాత్ర. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రూపొందించిన యాత్ర 2 చిత్రం ఈరోజు విడుదలైంది. పార్ట్ 1 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రను.. పార్ట్ 2 లో సీఎం జగన్ పాత్రతో రూపొందించారు. ఈరోజు విడుదలైన ఆ చిత్రం పాజిటివ్ టాక్ అందుకుంటుంది. ముఖ్యంగా వైసీపీ అభిమానులను అలరిస్తోంది.

మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన యాత్ర సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఇప్పుడు పార్ట్ 2 లో మాత్రం జగన్ పాత్రలో తమిళ యువనటుడు జీవ మెప్పించారు. అయితే రాజకీయంగా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం భావోద్వేగాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేశారు. 2009 నుంచి 2019 వరకు జరిగిన రాజకీయ పరిణామాలను చూపించారు. అయితే సరిగ్గా ఎన్నికల ముంగిట విడుదలైన ఈ చిత్రం.. వైసిపి కి ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా రాజకీయాలు హీటెక్కించాయి.

ఈ సినిమా కోసం ఏకంగా అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేయడం విమర్శలకు దారితీస్తోంది. సహజంగానే సీఎం జగన్ నిజజీవిత కథ కావడంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. అయితే ఈ సినిమా కోసం ఏకంగా చట్టసభల సమావేశాలను వాయిదా వేయడం మాత్రం సహేతుకంగా లేదు. గత కొద్దిరోజులుగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటికి నిన్న ఓటాన్ బడ్జెట్ ని కూడా ప్రవేశపెట్టారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాల చివరి రోజు అని షెడ్యూల్లో ప్రకటించారు. అందుకే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అన్ని రకాలుగా సిద్ధమై సమావేశాలకు హాజరయ్యారు. కానీ తొలుత కోరం లేదని సమావేశాన్ని వాయిదా వేశారు. చివరకు యాత్ర 2 సినిమాకు వైసిపి ఎమ్మెల్యేలు వెళ్లడం వల్ల సమావేశాలు వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ సభ్యులు ఆగ్రహంతో సభను వాకౌట్ చేశారు. ఒక సినిమా కోసం సభలను వాయిదా వేయడం ఏమిటని ఆక్షేపించారు. శాసనసభ చరిత్రలో ఇదో చీకటి రోజు అని అభివర్ణించారు.