Nara Lokesh: నారా లోకేష్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టునున్నారు. గత కొద్ది రోజులుగా లోకేష్ పెద్దగా బయటకు కనిపించడం లేదు. జనసేనతో పొత్తులు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక వంటి విషయాల్లో బిజీగా ఉన్నారు. అవన్నీ కొలిక్కి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు బిజెపి సైతం కూటమిలోకి వచ్చే అవకాశం ఉంది. పొత్తుపై మూడు పార్టీలు సంయుక్తంగా కీలక ప్రకటన చేసే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో లోకేష్ రాష్ట్రవ్యాప్త పర్యటనలకు సిద్ధమయ్యారు. శంఖారావం పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. యువగళం పాదయాత్రలో టచ్ చేయని నియోజకవర్గాల్లో శంఖారావసభలు కొనసాగనున్నాయి.
గత ఏడాది లోకేష్ పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి విశాఖ జిల్లా అగనంపూడి వరకు మూడు వేల కిలోమీటర్ల కు పైగా లోకేష్ నడిచారు. వాస్తవానికి ఆయన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు కొనసాగుతుందని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగా షెడ్యూల్ రూపొందించారు. కానీ మధ్యలో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో చాలా రోజులపాటు పాదయాత్ర నిలిచిపోయింది.చంద్రబాబు కేసుల పర్యవేక్షణలో భాగంగా లోకేష్ పాదయాత్రను నిలిపివేయాల్సి వచ్చింది. చంద్రబాబుకు బెయిల్ లభించిన తరువాత పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. కానీ షెడ్యూల్ ను కుదించారు. విశాఖ నగర శివారులోని అగనంపూడి తో సరిపెట్టారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు.
అయితే లోకేష్ పాదయాత్ర చేయని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ముందుగా శంఖారావసభలతో లోకేష్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. సుమారు 50 రోజులపాటు ఈ శంఖారావయాత్రలు కొనసాగునున్నాయి. పాదయాత్రలో భాగంగా టచ్ చేయని నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటన ఉంటుంది. ఈనెల 11న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో తొలి సభ ఉంటుంది. రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటన ఉండనుంది. సుమారు 50 రోజుల పాటు 150 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా లోకేష్ పర్యటనలు కొనసాగునున్నాయని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు పొత్తుల ప్రకటన, సీట్ల సర్దుబాటు తర్వాత చంద్రబాబు దూకుడు పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే రా కదలిరా పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. ఇంకా ఐదు సభలు పెండింగ్ లో ఉన్నాయి. ముందుగా చంద్రబాబు వాటిని పూర్తి చేయనున్నారు. పొత్తు కుదిరిన తర్వాత బిజెపి అగ్ర నేతలు, పవన్ కళ్యాణ్ తో ఉమ్మడిగా చంద్రబాబు ప్రచార సభల్లో పాల్గొనున్నారు. దీనికి సంబంధించి కార్యాచరణ సిద్ధమవుతోంది. ఇంతలో లోకేష్ శంఖారావ సభలు కూడా ప్రారంభం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. తొలుత ఉత్తరాంధ్రలో పూర్తిచేయాలని భావిస్తున్నారు.