TTD Trust Board Chairmen : ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఎంతో కీలకం. పెద్దపెద్ద నాయకులు ఆ పదవిని కోరుకుంటారు. స్వామివారి సేవలో తరించాలని భావిస్తారు. అదే సమయంలో ఆ పదవి అత్యంత పవర్ ఫుల్ కూడా. క్యాబినెట్ హోదాతో సమానమైన పదవి అది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వారు తమ అస్మదీయులకే ఆ పదవి అప్పగిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే ప్రతి కార్యక్రమం వారి పర్యవేక్షణలోనే జరుగుతుంది. అయితే ఈసారి తిరుమలలో బ్రహ్మోత్సవాలు టీటీడీ ట్రస్ట్ బోర్డు లేకుండానే పూర్తయ్యాయి. తిరుమలలో బ్రహ్మోత్సవాలు అతిపెద్ద పండుగగా పరిగణిస్తారు. కానీ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరిగింది. అయితే ఇటీవల జరిగిన పరిణామాల క్రమంలోనే ట్రస్ట్ బోర్డు ఏర్పాటు ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. అప్పటినుంచి రచ్చ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసే వరకు పరిస్థితి మారింది. అయితే ఇటువంటి తరుణంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా సమర్ధుడైన వ్యక్తిని నియమించాలని ప్రభుత్వం భావించింది. గతం మాదిరిగా రాజకీయ పార్టీ నేతకు అప్పగిస్తే విమర్శలు ఖాయమని అంచనా వేసింది. అందుకే ట్రస్ట్ బోర్డును ప్రకటించలేదని తెలుస్తోంది.
* తొలుత నాగబాబు పేరు
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే టీటీడీ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. అప్పటివరకు చైర్మన్ గా ఉన్న కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ప్రధానంగా మెగా బ్రదర్ నాగబాబు పేరు వినిపించింది. అయితే తన సోదరుడికి ఆ పదవి అక్కర్లేదని పవన్ కళ్యాణ్ ఇటీవల ఓ సమావేశంలో సైతం తేల్చేశారు. అయితే చాలామంది ఆ పదవుల కోసం తనను అడుగుతున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. అటు సినీ రంగం నుంచి చాలామంది వ్యక్తుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఓ మీడియా ఛానల్ అధినేత పేరు సైతం పరిగణలోకి తీసుకున్నట్లు ప్రచారం సాగింది. కానీ చంద్రబాబు మాత్రం ఎవ్వరిని ఖరారు చేయలేదు.అయితే ఈసారి నేతలను పరిగణలోకి తీసుకోకుండా.. తటస్థ వేదికలపై ఉండే వివిధ రంగాల ప్రముఖులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
* విముఖతకు అదే కారణం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రానికి చెందిన వ్యక్తి వ్యవహరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పదవీ విరమణ పొంది శేష జీవితం గడుపుతున్నారు. ఆయనను చంద్రబాబు సర్కార్ ఆశ్రయించుగా సున్నితంగా తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన పరిణామాలతో కోట్లాదిమంది భక్తుల చూపు టీటీడీపై ఉంది. ఈ తరుణంలో చిన్నపాటి తప్పిదం జరిగిన ఆ ప్రభావం వ్యక్తిత్వం పై పడుతుంది. అందుకే ఆయన సైతం పునరాలోచనలో పడినట్లు సమాచారం. అనవసరంగా విమర్శలకు తావివ్వకూడదని.. గతంలో ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికైనప్పుడు జరిగిన వివాదం అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు లడ్డు వివాదం కొనసాగుతుండగా ఆ బాధ్యతలు తీసుకునేందుకు వివిధ రంగాల ప్రముఖులు సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ పోస్ట్ గా ఎన్నికైన వ్యక్తి అందరి మన్ననలు పొందాలి. ఎంతో భక్తి భావంతో ఉండాలి. మరి అటువంటి వారిని ఎంపిక చేయడం కూటమి ప్రభుత్వానికి కత్తి మీద సామే.