Himansu Shukla And Kritika: ఆ ఇద్దరూ యువ ఐఏఎస్ లు ఒకేసారి ఎంపికయ్యారు. శిక్షణ సమయంలోనే స్నేహితులుగా మారారు. మనసులు పంచుకొని ప్రేమికులుగా మారారు. వారి ప్రేమను అర్థం చేసుకున్న పెద్దవారు ఆశీర్వదించారు. వివాహం జరిపించారు. ప్రస్తుతం ఆ ఇద్దరు దంపతులు పక్కపక్క జిల్లాల్లో కలెక్టర్లుగా ఉన్నారు. ఇదో సినిమాలా ఉంది కదూ. కాదండి ఇది నిజమే. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ కలెక్టర్ హిమాన్సు శుక్లా, కాకినాడ కలెక్టర్ కృతిక శుక్లా దంపతులు. ఒకరిది చండీగఢ్, మరొకరిది ఉత్తర ప్రదేశ్. ఈ ఇద్దరినీ కలిపింది ప్రేమ బంధం. ఆ బంధం వివాహం వైపు అడుగులు వేసింది. 2013లో ప్రేమతో మొదలైన వీరి బంధం.. 2017లో పెళ్లితో సుఖాంతం అయ్యింది.
2013లో ఐఏఎస్ లుగా ఎంపికయ్యారు హిమాన్స్ శుక్లా, కృతిక శుక్లా. ముస్సోరీలో ఐఏఎస్ శిక్షణ శిబిరంలో ఇద్దరు కలుసుకున్నారు. కృతిక ఎకనామిక్స్ లో దిట్ట. ఫైనాన్స్ పీహెచ్డీ చేశారు. ఆమెతో పరిచయం అయ్యాక ఇంజనీరింగ్ విద్యార్థి అయిన హిమాన్షు ఎకనామిక్స్ లో మాస్టర్ డిగ్రీ చేశారు. ఇద్దరి కష్టాలు, అభిరుచులు, లక్ష్యాలు తెలుసుకొని అర్థం చేసుకున్నాక కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు తెలియజేసి వివాహం చేసుకున్నారు.
హిమాన్స్ శుక్లాది కాన్పూర్. ముంబై ఐఐటీలో చదివారు. ఇంటర్ తర్వాత మర్చంట్ నావిలో కోర్సు పూర్తి చేసి విదేశాలకు వెళ్లిపోయారు. 20 సంవత్సరాలకే ఉద్యోగం వచ్చింది. ఇటలీ, యూఎస్, చైనాలో ఐదేళ్లపాటు ఉద్యోగం చేశారు. పోటీ పరీక్షల కోసం సెలవు పెట్టి ఢిల్లీ వచ్చారు. ఎటువంటి శిక్షణ లేకున్నా తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ కు అర్హత సాధించారు. కృతిక శుక్లాది చండీగఢ్. 10, ఇంటర్లో టాపర్. న్యూఢిల్లీలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో చదివారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఎంకాం చేశారు. ఐఏఎస్ లక్ష్యంతో పరీక్ష రాస్తే రెండో ప్రయత్నంలో ఫలించింది. శిక్షణ సమయంలోనే ఎకనామిక్స్ లో పిహెచ్డి పూర్తి చేశారు.
ఈ యువ ఐఏఎస్ ల జంట ఏపీ క్యాడర్ లోనే వివిధ హోదాల్లో పని చేస్తూ వచ్చారు. పక్కపక్క జిల్లాలో ప్రస్తుతం కలెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వేరువేరు చోట్ల బాధ్యతలు, నిత్యం ఎదురయ్యే సవాళ్లు.. అన్నింటినీ సమర్థంగా అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. తమ ప్రేమ ఒకరోజులో సాకారం కాలేదని.. చాలా సమయం తీసుకున్నామని.. ఇద్దరం బాగా ఆలోచించాకే కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయానికి వచ్చామని మీరు చెబుతున్నారు. బాహ్య సౌందర్యం తాత్కాలికమని.. అంతర సౌందర్యం శాశ్వతమని.. ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే జీవితం సాఫీగా ముందుకు సాగుతుందని చెప్పుకొస్తున్నారు.