Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నాని కి ( Kodali Nani) బైపాస్ సర్జరీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆపరేషన్ ప్రారంభం అయ్యింది. గత కొంతకాలంగా ఉండే సంబంధిత సమస్యతో కొడాలి నాని బాధపడుతున్నారు. వారం రోజుల కిందట ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేయగా మూడు కవాటాల్లో సమస్య ఉన్నట్లు గుర్తించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ముంబాయిలోని ఏసియన్ హార్ట్ కేర్ సెంటర్ కు తరలించారు. బైపాస్ సర్జరీ అవసరం అని అక్కడి వైద్యులు గుర్తించారు. కొద్దిసేపటి క్రితం బైపాస్ సర్జరీ మొదలైనట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా కొడాలి నాని ఆరోగ్యం కోసం గుడివాడలో ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
Also Read : అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ?
* కొద్దిసేపటి కిందట..
కొద్దిసేపటి కిందటే ఏసియన్ హార్ట్ కేర్ సెంటర్ లో( Asian heart care centre) బైపాస్ సర్జరీని ప్రారంభించారు. ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ రమాకాంత్ పాండా నేతృత్వంలోని వైద్యుల బృందం బైపాస్ సర్జరీ చేస్తోంది. దాదాపు ఈ సర్జరీ 8 గంటలపాటు కొనసాగే అవకాశం ఉందని వైద్యులు చెప్పినట్లు నాని సన్నిహితులు చెబుతున్నారు. నాని ఆరోగ్య పరిస్థితిని మాజీ సీఎం జగన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అదే సమయంలో అక్కడ వైద్యులతో మాట్లాడుతున్నారు. వైద్యుల సైతం నాని కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
* హైదరాబాద్ కి పరిమితం
2024 ఎన్నికల్లో ఓటమి తరువాత కొడాలి నాని ఎక్కువగా హైదరాబాద్ కి( Hyderabad) పరిమితం అయ్యారు. అత్యవసర పనులు ఉంటే తప్ప నియోజకవర్గంలో అడుగుపెట్టడం లేదు. నెల రోజుల కిందట వల్లభనేని వంశీ అరెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. అక్కడకు రెండు రోజుల తర్వాత మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వల్లభనేని వంశీ మోహన్ ను పరామర్శించారు. ఆయన వెంట కొడాలి నాని కూడా ఉన్నారు. మీడియాతో మాట్లాడారు కూడా. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొడాలి నాని తిరిగి యాక్టివ్ అవుతారని ప్రచారం జరిగింది. ఇంతలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు.
* వైద్యుల సూచన మేరకు..
వాస్తవానికి హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రిలో( AIG Hospital) ఆయనకు స్టంట్సు వేస్తారని ప్రచారం జరిగింది. అయితే నానికి కిడ్నీ సంబంధిత సమస్యలు బయటపడటంతో వెనువెంటనే ఆసుపత్రి వర్గాలు ముంబైలోని ఏసియన్ హార్ట్ సెంటర్ కు రిఫర్ చేశాయి. ప్రస్తుతం కొడాలి నాని కి బైపాస్ సర్జరీ జరుగుతోంది. ఆపరేషన్ తర్వాత ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటెన్ విడుదల చేసే అవకాశం ఉంది.
Also Read : వక్ఫ్ సవరణ బిల్లులో టిడిపి మార్క్.. వాటికి జై కొట్టిన కేంద్రం!