AP Govt Employees: ఎన్నికల ముంగిట ఉద్యోగ సంఘాల నాయకుల నయా గేమ్

గత ఐదు సంవత్సరాలుగా ఉద్యోగ సంఘాల నేతల ప్రకటనలు చూస్తే ఇక వీరోచిత పోరాటమే అన్నట్టు బిల్డప్ నడిచింది. ప్రభుత్వం ఈతకాయంత ప్రయోజనం చేస్తే చాలు సీఎం జగన్ కు పొగడ్తలు, ఆపై చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయించాలన్న ఆదేశాలు ఉద్యోగ సంఘాల నేతల నుంచి వినిపించేవి.

Written By: Dharma, Updated On : February 13, 2024 5:19 pm
Follow us on

AP Govt Employees: లేడికి లేచిందే పరుగు అంటారు. ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు సైతం అదే ఫార్ములాను అనుసరిస్తున్నారు. సరిగ్గా ఎన్నికలకు నెలరోజుల ముందు ఉద్యోగుల సమస్యలు వారికి గుర్తుకు రావడం విశేషం. గత నాలుగున్నర సంవత్సరాలుగా తాము ఉద్యోగ సంఘాల నాయకులు అన్న మాట మరిచిపోయారు. ప్రభుత్వానికి దాసోహం అన్న రీతిలో ప్రకటనలు చేశారు.ఇప్పుడు ఎన్నికలు సమీపించేసరికి కొత్త నాటకాలకు తెర తీస్తున్నారు. ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఏకంగా 21 వేల కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉంది. వారి జీతం నుంచి వివిధ రకాలుగా కట్ చేసిన మొత్తాన్ని ప్రభుత్వం ఇతర అవసరాల కోసం వాడుకుంది. ఉద్యోగుల ప్రయోజనాలను మాత్రం పక్కన పెట్టింది. దీంతో తమకు అన్యాయం జరిగిందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు గగ్గోలు పెట్టారు. కానీ వారి ఆవేదన ఉద్యోగ సంఘాల నాయకులకు వినిపించలేదు.

అయితే గత ఐదు సంవత్సరాలుగా ఉద్యోగ సంఘాల నేతల ప్రకటనలు చూస్తే ఇక వీరోచిత పోరాటమే అన్నట్టు బిల్డప్ నడిచింది. ప్రభుత్వం ఈతకాయంత ప్రయోజనం చేస్తే చాలు సీఎం జగన్ కు పొగడ్తలు, ఆపై చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయించాలన్న ఆదేశాలు ఉద్యోగ సంఘాల నేతల నుంచి వినిపించేవి. కానీ తాటికాయ అంత అన్యాయం చేసినప్పుడు మాత్రం ఇదే ఉద్యోగ సంఘాల నేతలు మౌనం దాల్చేవారు. పోరాడితే కేసులు పెడతారన్న భయంతో కొందరు, వ్యక్తిగత ప్రయోజనాలు కల్పించుకునే లక్ష్యంతో మరికొందరు ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు. డిమాండ్లు చేయలేకపోయారు. లక్షలాదిగా ఉద్యమ బాట పట్టిన ఉపాధ్యాయులను దారుణంగా మోసం చేశారు. వివిధ రూపాల్లో ఉద్యోగులకు 21 వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నా.. బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వంటి వాళ్లు ప్రభుత్వాన్ని పొగిడారు. అది మా ధర్మం అన్నట్టు మాట్లాడారు.

మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రజలు తమ తీర్పు ఇవ్వనున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. ఇటువంటి సమయంలో తమకు 21 వేల కోట్లు రావాల్సి ఉందని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంతో చర్చలు జరపడం విశేషం. ఉద్యోగులకు సకాలంలో జీతాలు లేవు. ప్రతి నెల మూడో వారం దాటితే కానీ చెల్లింపులు చేయడం లేదు. పదవీ విరమణ చేసిన వారికి నెలల తరబడి బెనిఫిట్స్ అందడం లేదు. కనీసం పదవీ విరమణ చేసిన వారికి వృద్ధాప్య పింఛన్ కూడా సకాలంలో అందించలేకపోతున్నారు. మరోవైపు అభివృద్ధి పనులకు సైతం చెల్లింపులు లేవు. ఇన్ని నిజాలు బయటకు కనిపిస్తున్నా ఏనాడూ ఉద్యోగ సంఘాల నోరు తెరవలేదు. సరిగ్గా ఇప్పుడు ఎన్నికల ముంగిట వారు మాట్లాడుతుండడం దేనికి సంకేతం? ఉద్యోగ సంఘాల నేతలు అడుగుతున్నారు కాబట్టి.. మరోసారి గెలిస్తే ఇవన్నీ సమస్యలు పరిష్కరిస్తామని జగన్ తో హామీ ఇప్పిస్తారు. ప్రభుత్వంపై ఉద్యోగులకు ఉన్న వ్యతిరేకతను తగ్గిస్తారు. తమ వ్యక్తిగత ప్రయోజనాలు పొందుతారు. ఎన్నికల ముంగిట ఉద్యోగ సంఘాల నేతలకు ఇదో బంపర్ ఆఫర్ తప్ప.. తమకు కాదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు తేల్చి చెబుతున్నారు. ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలని శత్రువు పలుకుతున్నారు.