Job Calendar AP: జనవరి( January) సమీపిస్తోంది. ఏపీలో జాబ్ క్యాలెండర్ ప్రకటనకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల ప్రకటనపై కసరత్తు ప్రారంభించారు. ఏయే శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి? ఖాళీగా ఉన్న కాంట్రాక్టు పోస్టులు ఎన్ని? అనే వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. మొన్ననే డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి చేసి 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహిస్తోంది. అయితే పాఠశాల విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఏటా డీఎస్సీ ఉంటుందని.. జాబ్ క్యాలెండర్ సైతం విడుదల చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో జనవరి మొదటి వారంలోనే జాబ్ క్యాలెండర్ విడుదలకు సన్నాహాలు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది.
* వేలాదిగా ఖాళీలు..
రాష్ట్రవ్యాప్తంగా చాలా శాఖల్లో ఉద్యోగాలు( employment) ఖాళీగా ఉన్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు అన్ని శాఖల్లో కలిపి 30 శాతం వరకు ఖాళీలు ఉన్నాయి. కానీ చాలా పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందుకే ఈ ఖాళీల విషయంలో ఎలా భర్తీ చేయాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏపీపీఎస్సీ ద్వారా 20 నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు 157 విభాగాల మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలు నిర్ధారించారు. దాదాపుగా 99 వేల ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.
* ఆర్థిక శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారం రెవెన్యూ శాఖలో మొత్తం ఖాళీలు 13000. ఇప్పటివరకు 4787 ఖాళీలను నిర్ధారించారు. అయితే నేరుగా రిక్రూట్మెంట్ కింద వచ్చేవి 252.
* విద్యా శాఖలో దాదాపు 7వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యూనివర్సిటీలోనే మూడు వేలకు పైగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఎక్కువగా కోర్టు కేసులతో పెండింగ్లో ఉన్నాయి.
* పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో 27 వేల ఖాళీలు ఉన్నాయి. అయితే అందులో 23 వేల పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది.
* నైపుణ్యాభివృద్ధి తో పాటు శిక్షణ విభాగంలో నాలుగు వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వ్యవసాయ శాఖలో మరో మూడు వేల వరకు ఖాళీగా ఉన్నాయి.
* పంచాయితీ రాజ్ శాఖలో 26 వేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నిర్ధారించారు. మరో మూడు వేల పోస్టులను ఇన్ సర్వీస్ పదోన్నతులతో భర్తీ చేస్తారు. అయితే వీటన్నింటినీ గుర్తించిన తరువాత మాత్రమే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారు. జనవరి నాటికి జాబ్ క్యాలెండర్ ప్రకటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.