Amravati Capital: అమరావతి ( Amravati capital ) రైతులకు భయం వెంటాడుతోంది. గత అనుభవాల దృష్ట్యా మరోసారి రాజధానిని కదిలిస్తారా? అన్న అనుమానం ఉంది. ఈ నేపథ్యంలో అమరావతి రైతులు చాలా రకాల డిమాండ్లు తెరపైకి తెస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి విన్నవించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు వీలైనంత త్వరగా కేటాయించాలని కోరుతున్నారు. అదే సమయంలో కేంద్రం అమరావతిని గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుతున్నారు. అయితే ఇంతవరకు ఏ రాజధానికి కూడా గెజిట్లేదని.. అమరావతికి కూడా అవసరం లేదని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో గెజిట్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని.. కానీ న్యాయ చిక్కుముడులు ఉన్నాయని.. అవి తీరాక తప్పకుండా గెజిట్ ప్రకటిస్తారని చెబుతున్నారు. దీనిపై డిసెంబర్లో ఫుల్ క్లారిటీ వస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు.
* వెంటాడుతున్న అనుమానాలు..
అమరావతి రైతుల్లో ఒక రకమైన అనుమానం ఉంది. అందరి ఏకాభిప్రాయంతో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు( CM Chandrababu) అమరావతిని ఎంపిక చేశారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసింది. అంతటితో ఆగకుండా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. రైతులకు కౌలు చెల్లించలేదు. ఆపై ఆర్ 5 జోన్ అంటూ చెప్పి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు పంచిపెట్టారు. పైగా నాడు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి ఉంటే అమరావతి విషయంలో జగన్ సర్కార్ వెనక్కి తగ్గేది అనే అభిప్రాయం రైతుల్లో ఉంది. ఇప్పుడు అదే విషయాన్ని ఐక్య కార్యాచరణ సమితి ద్వారా సిఆర్డిఏ దృష్టికి తీసుకెళ్లారు అమరావతి రైతులు. అయితే డిసెంబర్లో పార్లమెంటు సమావేశాల్లో అమరావతి పై చర్చిస్తారని.. దానికి చట్టబద్ధత కల్పిస్తారని సి ఆర్ డి ఏ అధికారులు చెప్పుకొస్తున్నారు.
* రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్..
ప్రస్తుతం ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) కీలక భాగస్వామి. ఆ పార్టీ విన్నపాలను కేంద్రం తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుంది. అమరావతి ఐక్య కార్యాచరణ సమితి కూడా టిడిపి కూటమికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు అదే ఐక్య కార్యాచరణ సమితి ద్వారా ఈ డిమాండ్లు వస్తుండడం వెనుక రాష్ట్ర ప్రభుత్వము ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి అమరావతికి చట్టబద్ధత కల్పించడంతోపాటు దేశంలో ఎక్కడా లేని విధంగా.. ఈ రాజధానికి దక్కని విధంగా.. అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారని తెలుస్తోంది. అయితే అదే గానీ జరిగితే అమరావతికి ఒక అరుదైన గౌరవమే.