Jakkampudi Raja: వైసీపీలో తొలి తిరుగుబాటు

తాజాగా జక్కంపూడి రాజా ధనుంజయ రెడ్డి పైనే తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వల్లే ఓటమి ఎదురైందని చెప్పుకొచ్చారు. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రస్థాయిలో చాలా రకాల ఉద్యమాలు చేపట్టింది. అప్పటి టిడిపి ప్రభుత్వంలో నెలకొన్న భూవివాదాలపై గట్టి పోరాటమే చేసింది.

Written By: Dharma, Updated On : June 7, 2024 9:24 am

Jakkampudi Raja

Follow us on

Jakkampudi Raja: ఏపీలో వైసీపీకి దారుణ ఓటమి ఎదురైంది. గతంలో ఏ స్థాయి విజయం దక్కిందో.. ఇప్పుడు అదే స్థాయిలో ఓటమి పలకరించింది. జాతీయస్థాయిలో వైసిపి పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. అటు ఓటమిపై పోస్టుమార్టం ప్రారంభించారు జగన్. కానీ వైసీపీ నేతల నుంచి తిరుగుబాటు వాయిస్ ప్రారంభమైంది. ప్రజలు అంతులేని విజయం అందిస్తే.. జగన్ సలహాదారులు, అధికారుల చేతిలో పెట్టారని.. వారు పాలనను భ్రష్టు పట్టించారని వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం ప్రారంభించారు. తొలిసారిగా మాజీ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఓటమిపై మాట్లాడారు. కేవలం సీఎం జగన్, సలహాదారులు, సీఎంవో అధికారులు తీరుతోనే ఈ పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఏ పార్టీకి ఓటమి ఎదురైనా అధినేతను ఆక్షేపించారు. చుట్టూ ఉన్న వ్యవస్థలని తప్పు పట్టడం ఆనవాయితీగా వస్తోంది. గత ఎన్నికల్లో చంద్రబాబు దారుణ పరాజయం మూటగట్టుకున్నారు. ఆ సమయంలో చంద్రబాబు కంటే.. ఆయన కోటరీ చుట్టూ విమర్శలు వెల్లువెత్తాయి. పార్టీలోని నేతలు ఓటమిపై సమీక్షించే క్రమంలో చంద్రబాబును తప్పు పట్టలేదు. చంద్రబాబు, లోకేష్ చుట్టూ ఉన్న కోటరీని, అధికార గణం తీరును తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. ఇప్పుడు వైసీపీలో సైతం అదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారిగా ఉన్న ధనుంజయ రెడ్డి పై ఓటమి భారాన్ని మోపుతున్నారు వైసీపీ నేతలు.

తాజాగా జక్కంపూడి రాజా ధనుంజయ రెడ్డి పైనే తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వల్లే ఓటమి ఎదురైందని చెప్పుకొచ్చారు. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రస్థాయిలో చాలా రకాల ఉద్యమాలు చేపట్టింది. అప్పటి టిడిపి ప్రభుత్వంలో నెలకొన్న భూవివాదాలపై గట్టి పోరాటమే చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదు. ప్రతి సమస్య సీఎం జగన్ టేబుల్ పైకి వెళ్లినా పరిష్కార మార్గం చూపించాల్సింది ధనుంజయ రెడ్డి. అంతలా బాధ్యతలు అప్పగించారు జగన్. కానీ ధనుంజయ రెడ్డి చొరవ చూపలేదు. సమస్యలకు పరిష్కారం చూపలేదు. దీంతో పరిస్థితి రోజురోజుకు చేయి దాటింది. చివరకు వైసీపీలో తలెత్తిన రాజకీయ విభేదాల పరిష్కార బాధ్యతను కూడా ధనంజయ రెడ్డికి అప్పగించారు. ప్రకాశం జిల్లాలో భూ వివాదాలు పరిష్కార బాధ్యత ఆయన చూసుకున్నారు. కానీ చక్కటి పరిష్కార మార్గాలు చూపలేకపోయారు. దీంతో ప్రకాశం జిల్లాలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.

ప్రస్తుతం జగన్ ఓటమిపై పోస్టుమార్టం చేసే పనిలో ఉన్నారు. కానీ ఓటమికి సీఎం జగన్ కారణమని ఎక్కువమంది వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. జక్కంపూడి రాజా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చాలామంది సీనియర్లు ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ వారి మాటలు చెల్లుబాటు కాలేదు. సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, బాబాయి వైవి సుబ్బారెడ్డి, ఐఏఎస్ అధికారులు జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వంటి వారి చట్రంలో జగన్ ఉండిపోయారు. వారిని నమ్ముకునిపార్టీ శ్రేణులకు దూరమయ్యారు. వారి సమస్యలకు పరిష్కారం చూపలేకపోయారు. అయితే ఇప్పుడు ఓటమి ఎదురు కావడంతో పార్టీ నేతల నుంచి ప్రశ్నలు, నిలదీతలు ఎదురవుతున్నాయి. మున్ముందు తిరుగుబాటు సైతం పెరిగే అవకాశం ఉంది.