AP Assembly Election Results 2024: ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ మీడియా. కానీ ఆ మీడియాకు స్వేచ్ఛ లేదు. ఎప్పుడైతే మీడియాలో రాజకీయం ప్రవేశించిందో.. ప్రజాస్వామ్యం సైతం కలుషితం అయ్యింది. మీడియాలో సైతం విభజన రాక వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఆ పరిస్థితి ఎక్కువగా ఉంది. రాజకీయ పార్టీలే నేరుగా మీడియాను ఏర్పాటు చేశాయి. మిగిలిన మీడియాలు సైతం రాజకీయ పార్టీల వారీగా విభజించబడ్డాయి. ఏపీలో వైసీపీకి అనుకూలంగా నీలి మీడియా, టిడిపికి అనుకూలంగా ఎల్లో మీడియా, పరిస్థితులకు తగ్గట్టు నడుచుకునే కూలి మీడియా.. ఇలా రకరకాలుగా విభజించబడ్డాయి. ఒకరు అధికారంలోకి వస్తే.. ప్రత్యర్థి మీడియా ఇబ్బంది పడాల్సిందే. గత ఐదు సంవత్సరాలుగా వైసిపి అధికారంలో ఉండడంతో నీలి మీడియాకు ఎనలేని ప్రాధాన్యం లభించింది. ఎల్లో మీడియా ప్రభుత్వ వ్యతిరేక కథనాలకు పరిమితమైంది. అందుకే ఎల్లో మీడియా గా పిలవబడే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ వంటి వాటిపై వైసిపి బ్యాన్ కొనసాగింది. ఇప్పుడు నీలి మీడియాను కొత్త ప్రభుత్వం టార్గెట్ చేయనుంది.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈటీవీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ ఛానల్ ప్రసారాలను నిలిపివేశారు. కేబుల్ ఆపరేటర్ల పై ఒత్తిడి పెంచి, భయపెట్టి ఈ ఛానళ్ల ప్రసారాలను నిలుపుదల చేయించారు.కానీ వాటి యాజమాన్యాలు రకరకాల ప్రయత్నాలు చేసి తిరిగి ప్రసారాలు పునరుద్ధరించుకున్నాయి. ప్రజల మధ్యకు వెళ్లాయి.ఇప్పుడు సేమ్ సీన్ నీలి మీడియాపై కనిపిస్తోంది.సాక్షి, టీవీ9, ఎన్ టివి, 10 టీవీల ప్రసారాలను నిలిపి వేసేందుకు అప్పుడే కొత్త ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ నాలుగు చానళ్లు ఏపీలో ప్రసారం కాకుండా చూడాలని కేబుల్ ఆపరేటర్ల పై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం.
మీడియాపై గొంతు నొక్కడం ఇప్పుడే కాదు.. ఏనాడో ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉండేవి. దానికి చెప్పేందుకు సాక్షి మీడియాను తెరపైకి తెచ్చారు జగన్. 2004లో తొలిసారి రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. 2009 ఎన్నికల్లో సైతం గెలిచారు. ఆయన కుమారుడు, కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి ఇందిరా మీడియా పేరిట సాక్షి ఛానల్ ను, పత్రికను ప్రారంభించారు. అప్పటి నుంచి మీడియాలో విభజన రేఖ కనిపించింది. ఒకరు అధికారంలోకి వస్తే ప్రత్యర్థులకు మద్దతుగా ఉన్న మీడియాను నిషేధించడం, ప్రసారాలు కాకుండా కట్టడి చేయడం వంటివి చేసేవారు. అయితే నిన్నటి వరకు ఎల్లో మీడియాపై నిషేధాజ్ఞలు కొనసాగగా.. ఇప్పుడు నీలి మీడియాపై ప్రారంభం కావడం విశేషం. మొత్తానికైతే ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియాపై ఏపీలో జరుగుతున్న వివక్ష చూసి సగటు పౌరుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.