YS JaganMohan Reddy : జగన్, షర్మిలాల మధ్య యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత వైరం కాస్త రాజకీయ వైరంగా మారిపోయింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి చేరింది. తల్లి విజయమ్మ తో పాటు సోదరి షర్మిలపై ఏకంగా న్యాయస్థానంలోనే పిటిషన్లు దాఖలు చేశారు జగన్. ఈ తరుణంలో ఇద్దరూ లేఖాస్త్రాలు సంధించుకున్నారు. 200 కోట్ల రూపాయలు ఇచ్చానని.. అయినా సరే షర్మిల తనకు మానసిక క్షోభ పెడుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అటు షర్మిల సైతం జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో చెల్లెలు షర్మిల తో ఉన్న వివాదంపై ఓపెన్ గా మాట్లాడారు జగన్. వైయస్ షర్మిల కు సంబంధించిన లేఖను టిడిపి విడుదల చేసిన సంగతి తెలిసిందే. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షర్మిల రాసిన లేఖ ఇది అంటూ పోస్ట్ చేసిన సంగతి బయటపడింది. దానిపై కూడా తాజాగా జగన్ స్పందించారు. ఏకంగా మీడియాకు కొన్ని సూచనలు చేశారు. విజయనగరం జిల్లా గుర్ల లో డయేరియా బాధితులను పరామర్శించారు జగన్. విజయనగరానికి కూత వేటు దూరంలో ఉన్న గ్రామంలో ఈ పరిస్థితి ఏంటని నిలదీశారు. బాధితులను కార్పొరేట్ ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. తాను స్పందించే వరకు ప్రభుత్వానికి చలనం రాలేదన్నారు. గుర్లలో 14 మంది డయేరియాతో చనిపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. తమ హయాంలో గ్రామాల అభివృద్ధికి పెద్ద పీట వేశామని.. ప్రజారోగ్యం కోసం ఆలోచన చేసే వారమని చెప్పుకొచ్చారు జగన్.
* అలా ఓపెన్ అయిన జగన్
అయితే ప్రభుత్వం పై విమర్శలు చేసే క్రమంలో జగన్ ఓపెన్ అయ్యారు. పాలనను గాలికి వదిలేసి కుటుంబాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు పై మండిపడ్డారు. టిడిపి తో పాటు అనుకూల మీడియా తన చెల్లి, తల్లి ఫోటోలతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మీ ఇళ్లలో సమస్యలు లేవా అంటూ నిలదీశారు. అందరి ఇంట్లో ఉన్నదే తన ఇంట్లో ఉందని వ్యాఖ్యానించారు. ఈ ప్రచారం వదిలేసి ప్రజా సమస్యలపై పని చేయాలని జగన్ సూచించారు. ఇకనైనా ఇటువంటి ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు.
* లేఖ పోస్ట్ చేయడంతో
అయితే అంతకుముందు మాజీ సీఎం జగన్ కు వైయస్ షర్మిల లేఖ రాశారు. తండ్రి ఆదేశాలను, అభిమతాన్ని గాలికి వదిలేసారని అసహనం వ్యక్తం చేశారు. జగన్ నైతికంగా దిగజారిపోయారని ఆరోపించారు. తన తల్లిపై ఫిర్యాదు చేసి పాతాళానికి కూరుకు పోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికైనా తండ్రికి ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోవాలని.. మన మధ్య కుదిరిన ఒప్పందానికి కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నానని షర్మిల ఆ లేఖలో పేర్కొన్నారు. అదే లేఖను టిడిపి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దానిపైనే ఓపెన్ కామెంట్స్ చేశారు జగన్.