YSR Congress : వైసీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. పెద్ద ఎత్తున నాయకులు పార్టీని వీడుతున్నారు. అయితే చాలా మంది ఏ పార్టీలో చేరడం లేదు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారు. వైసిపికి దారుణ పరాజయం ఎదురు కావడంతో చాలామంది నేతలు సైలెంట్ అయ్యారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎన్నికలకు ముందు టిడిపి నుంచి వైసీపీలో చేరిన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. సొంత చిన్ని చేతిలో ఓడిపోయారు. టిడిపి కూటమి అత్యధిక మెజారిటీతో గెలవడంతో మనస్థాపానికి గురయ్యారు. తప్పుడు నిర్ణయం తీసుకున్నానని పశ్చాత్తాప పడ్డారు. వైసీపీలో ఉండలేక.. తిరిగి టిడిపిలో చేరే మార్గం లేక క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అటు తరువాత సినీ నటుడు అలీ సైతం తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. తద్వారా వైసిపి తో ఉన్న బంధాన్ని విడిచి పెట్టుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా టిడిపిలో చేరిన అలీ.. ఎన్నికల ప్రచారానికి పరిమితమయ్యారు. ఆయనకు టికెట్ లభించలేదు. వైసీపీ అధికారంలోకి రావడంతో పెద్ద నామినేటెడ్ పదవి దక్కుతుందని భావించారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుతో జగన్ సరిపెట్టారు. అయినా సరే ఈ ఎన్నికల్లో అవకాశం దక్కుతుందని అలీ భావించారు. కానీ ఎక్కడా టికెట్ కేటాయించలేదు. దీంతో అలీ ఎన్నికల ప్రచారానికి రాలేదు. వైసీపీ దారుణ పరాజయంతో ఆ పార్టీకి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
* వరుసగా నేతలంతా
ఇటీవల ప్రకాశం జిల్లాకు చెందిన శిద్దా రాఘవరావు, గుంటూరుకు చెందిన కిలారి రోశయ్య, మద్దాలి గిరి వంటి నేతలు పార్టీని వీడారు. వైసీపీకి రాజీనామా చేశారు. అయితే ఇలా రాజీనామా చేస్తున్న వారు ఏ పార్టీలో చేరడం లేదు. ఎక్కువమంది క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని మాత్రం నిర్ణయించుకున్నారు. అయితే కూటమి పార్టీలో అవకాశం దొరకకే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా మాజీ మంత్రి, జగన్ సన్నిహితుడు ఆళ్ళ నాని పార్టీకి రాజీనామా చేశారు. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే ఆళ్ల నాని వైసిపిని వీడడం సంచలనమే.
* వైసీపీలో సీనియర్
వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచారు ఆళ్ల నాని. 2004లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో రెండోసారి గెలిచారు. 2013 నాటికి వైసీపీలో చేరారు. 2014 తరువాత జిల్లా పార్టీ అధ్యక్షుడయ్యారు. ఎమ్మెల్సీ పదవిని సైతం దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. జగన్ తొలి క్యాబినెట్ లోనే చోటు దక్కించుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖతో పాటు డిప్యూటీ సీఎం హోదాను పొందారు. జగన్ కు అత్యంత సన్నిహిత నేతల్లో ఆళ్ల నాని ఒకరు. గానీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
* పార్టీకి,పదవులకు రాజీనామా
ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆళ్ల నాని ఉన్నారు. కానీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వైసిపి గెలవలేకపోయింది. నాని సైతం 62 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. భారీ ఓటమితో వైసీపీ నేతలు పార్టీని వీడుతున్నారు. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు నాని దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా పార్టీకి గుడ్ బై చెప్పడం సంచలనం రేకెత్తించింది. దీని వెనుక రకరకాల ప్రచారం నడుస్తోంది.