Botsa Satyanarayana : విశాఖలో బొత్స డ్రాప్.. జగన్ మరో అభ్యర్థిని వెతుక్కోవాల్సిందేనా?

వైసీపీలో ఆలస్యంగా చేరిన బొత్స కుటుంబానికి తగిన ప్రాధాన్యం ఇచ్చారు జగన్. మంత్రివర్గ విస్తరణలో చాలామందిని మార్చినా బొత్సను మాత్రం కొనసాగించారు. ఈ ఎన్నికల్లో ఏకంగా ఆ కుటుంబంలో నలుగురికి టికెట్లు ఇచ్చారు. కానీ అది గుర్తించుకోకుండా బొత్స కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం.

Written By: Dharma, Updated On : August 9, 2024 6:04 pm
Follow us on

Botsa Satyanarayana :  విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల నుంచి బొత్స తప్పుకుంటారా? పోటీ చేసేందుకు భయపడుతున్నారా? ఓటమి తప్పదని భావిస్తున్నారా? అది రాజకీయంగా మంచిది కాదని అంచనా వేస్తున్నారా? జగన్ తనను బలి పశువు చేస్తున్నారని గ్రహించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా గెలిచి పూర్వ వైభవం సాధించాలని భావిస్తున్నారు. బలమైన నేతగా భావించి బొత్స సత్యనారాయణ ను రంగంలోకి దించారు. దాదాపు 800 మంది స్థానిక ప్రజాప్రతినిధులకు గాను.. వైసీపీకి 600 మంది బలం ఉంది. ఆపై బొత్స అంగబలం, ఆర్థిక బలంతో నెట్టుకొస్తారని జగన్ అంచనా వేశారు. అయితే పరిస్థితి చూస్తే మరోలా ఉంది. అందుకే బొత్స పోటీ చేయడానికి వెనుకడుగు వేస్తున్నారని ప్రచారం ప్రారంభం అయింది. స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీ హయాంలో ఎలా జరిగాయో బొత్సకు తెలియంది కాదు. ఆపై చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను సీఎం రమేష్ కు అప్పగించారు. ఆయన దూకుడు ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి తెలిసింది. ఎలక్షన్ క్యాంపెయిన్ లో సీఎం రమేష్ స్టైల్ వేరు. ఆపై కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ని కైవసం చేసుకోవాలని గట్టి ప్రయత్నంలో ఉంది. అందుకే బొత్స వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

* రాజకీయ భవితవ్యానికి దెబ్బ
అయితే ఈ ఎన్నికలతో బొత్స రాజకీయ భవితవ్యాన్ని జగన్ దెబ్బతీయాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బొత్స విషయంలో అనివార్య పరిస్థితుల్లోనే జగన్ కలుపుకొని వెళ్లారు. వాస్తవానికి 2014 ఎన్నికల్లో బొత్స కుటుంబమంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉండేది. తనతో పాటు తనకుటుంబం పై సైతం బొత్స అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జగన్ గుర్తుంచుకున్నారు. కానీ ఉత్తరాంధ్రలో కీలకమైన జిల్లాతో పాటు ఆకట్టుకునేందుకు తప్పకుండా బొత్సను పార్టీలో చేర్పించుకున్నట్లు అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు పార్టీ క్లిష్ట సమయంలో ఉండడంతో బొత్స ద్వారా అధిగమించాలని జగన్ భావిస్తున్నారు.

*:ప్రజా ప్రతినిధులు డుమ్మా
జగన్ ఆర్థిక వనరులు అందిస్తారా? లేదా అన్నది తెలియడం లేదు. పార్టీ ప్రజాప్రతినిధులతో మాత్రం రెండుసార్లు సమావేశం అయ్యారు. వారిని బెంగుళూరు క్యాంపునకు తరలించారు. అధర్మంతో చంద్రబాబు గెలవాలని చూస్తున్నారని మాత్రం స్టేట్మెంట్లు ఇచ్చారు. అయితే అక్కడకు కనీసం 300 మంది ప్రజాప్రతినిధులు రాకపోవడంతో బొత్సలో కలవరం ప్రారంభమైంది. ఇప్పటికే కొందరు చేజారి పోయారు. మరికొందరు కూటమికి టచ్లోకి వెళ్లారు. పోటీ చేస్తే కనీస స్థాయిలో ఓట్లు వస్తాయా లేదా అన్న అనుమానం కలుగుతోంది. అందుకే మిడిల్ డ్రాప్ అవ్వాలని బొత్స భావిస్తున్నట్లు సమాచారం.

* ఇష్టం లేదా?
జగన్ కోసం తాను అనవసరంగా ఎందుకు బలిపశువు కావాలని బొత్స భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసలు తనకు ఇష్టం లేకుండానే అభ్యర్థిగా ప్రకటించారని అనుచరుల వద్ద బాధపడుతున్నట్లు సమాచారం. అయితే ఈ ఎన్నికల్లో బొత్స కుటుంబానికి జగన్ ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. నలుగురు కు టికెట్లు ఇచ్చారు. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి కి ఛాన్స్ ఇచ్చారు. అటువంటిది పార్టీ కష్టకాలంలో ఉంటే బొత్స పోటీకి ససేమిరా అనడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలి.