YS Jagan House : మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) నివాసంతో పాటు కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో పోలీస్ శాఖ అప్రమత్తం అయ్యింది. ఇటీవల జగన్ నివాసం సమీపంలో గడ్డి తగులబడిన సంగతి తెలిసిందే. దీనిపై పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ ప్రాంతంలో సీసీ పూటేజీలను ఇవ్వాలని పోలీసులు వైసీపీ నేతలకు సూచించారు. కానీ వారి నుంచి ఎటువంటి కదలిక లేకపోయింది. దీంతో పోలీసులే తాడేపల్లి లోని జగన్ నివాసంతో పాటు కార్యాలయం వద్ద ఎనిమిది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని ఆదివారం అమర్చారు. అయితే పోలీస్ శాఖ సొంతంగా వీటిని ఏర్పాటు చేస్తుండడం విశేషం.
* హై సెక్యూరిటీ జోన్ లో
గతంలో హై సెక్యూరిటీ జోన్లో ఉండేది తాడేపల్లిలోని( Tadepalli) వైసీపీ కేంద్ర కార్యాలయం. అప్పట్లో వైసిపి అధికారంలో ఉండడంతో ఈ కార్యాలయం శత్రు దుర్భేద్యంలో ఉండేది. నిత్యం పోలీసుల హడావిడి నడిచేది. పైగా తాడేపల్లి ప్యాలెస్ తో పాటు కార్యాలయానికి భారీ కంచె ఏర్పాటు చేశారు. అయితే అదంతా ప్రభుత్వ ధనంతోనే ఏర్పాటు చేసినట్లు విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వైసీపీ అధికారానికి దూరం కావడంతో ఈ కార్యాలయంతో పాటు జగన్ నివాసం వద్ద నిత్యం ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. మొన్నటికి మొన్న లోకేష్ పుట్టినరోజు నాడు టిడిపి కార్యకర్తలు అటువైపుగా హల్చల్ చేసినట్లు వైసిపి ఆరోపిస్తోంది. మరోవైపు మొన్ననే గడ్డి తగలబడింది. ఇంకోవైపు ఓ మహిళ జగన్మోహన్ రెడ్డి తో ఫోటో తీయించుకునేందుకు గంటల తరబడి అక్కడే బైఠాయించారు.
* పోలీసులకు సవాల్
తాడేపల్లి లోని జగన్( Jagan Mohan Reddy) నివాసం వద్ద వరుసగా జరుగుతున్న పరిణామాలు పోలీసులకు సవాల్ గా మారుతున్నాయి. మరోవైపు రాజకీయ వివాదాలుగా మారి అవకాశం ఉండడంతో పోలీస్ శాఖ అప్రమత్తం అయ్యింది. విస్తృత భద్రతా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే కార్యాలయంతో పాటు జగన్ నివాసం వద్ద సీసీ కెమెరాలను అమర్చే పనిలో పడింది. అయితే మొన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి దర్యాప్తులో భాగంగా సిసి పూటేజీలను పోలీసులు అడిగినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే వైసీపీ నుంచి స్పందన లేకపోవడంతో పోలీస్ శాఖ ఈ సీసీ కెమెరాలు స్వయంగా అమర్చినట్లు తెలుస్తోంది.
* ప్రభుత్వం అప్రమత్తం
అయితే ఈ విషయంలో ప్రభుత్వం ( government)ముందుగానే అప్రమత్తమైనట్లు సమాచారం. వరుసగా జరుగుతున్న పరిణామాలు చూసి.. మున్ముందు ఎటువంటి ఘటనలు జరిగిన అందుకు ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేస్తారని భావించి.. రాజకీయ విమర్శలు వస్తాయని అంచనా వేసి.. పోలీస్ శాఖ ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద, కార్యాలయం సమీపంలో సరి కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ భద్రత చర్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.