Ports In AP : ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఓడ రేవుగా విశాఖపట్నం ఉంది. దీనిని ఆధునికీకరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ ఓడరేవులలో అదనపు టెర్మినల్స్, పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే 20 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా మొత్తం కార్గోలో 20 శాతం ఆంధ్రప్రదేశ్ మీదుగా రవాణా కావాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ సీనియర్ అధికారి వివరణ ప్రకారం.. కొత్త ఓడరేవులను ఏర్పాటు చేయడానికి, పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. కొత్త ఓడరేవుల నిర్మాణం, మచిలీపట్నం, మూలపేట (గతంలో భానుపాడు), రామాయపట్నం లో వచ్చే రెండు మూడు సంవత్సరాలలో కార్గో కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశముంది. ప్రభుత్వ అంచనాలు ప్రకారం ఈ ఓడరేవులలో 16 వేల కోట్లకు పైగా ప్రారంభ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం నిర్ణయించుకున్నది.. ప్రస్తుత వైజాగ్ షిప్ యార్డును విశాఖపట్నం పోర్టు అధారిటీ నిర్వహిస్తున్నది. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర రేఖను కలిగి ఉంది. రాష్ట్ర అభివృద్ధికి పోర్టులు సహకరిస్తాయి. అందువల్ల వాటికి సంబంధిత మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి అనుసంధానిస్తే.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుందని” రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులు (ఓడరేవులు) సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. 2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ద్వారా హైదరాబాద్ తెలంగాణకు రాజధానిగా అయిపోయింది. అయితే అనేక ఫార్మా కంపెనీలు హైదరాబాదులో ఉండడంతో.. ఆంధ్రప్రదేశ్ చాలావరకు ఆదాయాన్ని కోల్పోయింది. పరిశ్రమలను కూడా కోల్పోయింది. అయితే ఈ నష్టాన్ని ఓడరేవుల అభివృద్ధి ద్వారా భర్తీ చేయాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఓడరేవుల అభివృద్ధికి దాదాపు 18 వేల కోట్లు అవసరమవుతాయని.. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ కు ఆంధ్రప్రదేశ్ అధికారులు సమర్పించారు. అయితే ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది.
స్మార్ట్ హ్యాండ్లింగ్
విశాఖపట్నం ఓడరేవులో ప్రస్తుతం ఆపరేటింగ్ సిస్టంలు మొత్తం రీ బూట్ అవుతున్నాయి. విశాఖపట్నం ఓడరేవులో కార్యకలాపాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా సాగుతున్నాయి.. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ మారిటైమ్ బోర్డు, (పరిశ్రమలు, పెట్టుబడులు కలిసి) 2030 నాటికి 75% ఓడరేవు వినియోగరెటును సాధించడానికి కృషి చేస్తున్నది. 2028 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సముద్ర విశ్వ విద్యాలయం, నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీని ద్వారా 5000 మంది నిపుణులకు శిక్షణ ఇవ్వాలని యోచిస్తోంది. పోర్ట్ టెర్మినల్స్, పారిశ్రామిక క్లస్టర్లను స్థానిక ప్రయోజనాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఉదాహరణకు మచిలీపట్నం ఓడరేవును పొగాకు గ్రానైట్, ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతికి ఉపయోగిస్తారు.. ఎనర్జీ క్లస్టర్ గా కూడా ఉపయోగించుకుంటారు.. మచిలీపట్నం ఓడ రేవును ఫేజ్ -1 లో 5,155 కోట్ల ఖర్చుతో ల్యాండ్ లార్డ్ మోడల్ కింద అభివృద్ధి చేస్తారు. దీని ద్వారా 35 మిలియన్ల సామర్థ్యంతో నాలుగు బెర్త్ లు నిర్మిస్తారు.. ఇక ప్రకాశం జిల్లాలోని వాడరేవు ఓడరేవు, గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం ఓడరేవులను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తారు. ఈ ఓడరేవుల అభివృద్ధి ద్వారా ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించనుంది. ఓడరేవుల సామర్థ్యాన్ని పెంచడం, పారిశ్రామిక సమూహాలు, పట్టణ కేంద్రాలను అభివృద్ధి చేయడం వంటి కార్యకలాపాల ద్వారా కూటమి ప్రభుత్వం త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నది. ఇతర మార్గాల కంటే జల రవాణా చవకగా ఉందనే వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించనుంది. రాబోయే కాలంలో పనులు మొత్తం పూర్తయితే.. ఆంధ్రప్రదేశ్లో గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం తో సహా మొత్తం ఏడు ఓడరేవులుంటాయి. వీటికి అనుసంధానంగా గ్లోబల్ షిప్ యార్డ్ మోడల్ అభివృద్ధి చేస్తే పెట్టుబడులు మరింతగా వస్తాయి. కొత్త ఓడరేవులతోపాటు ఉప్పాడ, విశాఖపట్నం, వాడరేవు, కొత్తపట్నం సహ రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది అత్యాధునిక షిప్పింగ్ హార్బర్లను ప్రభుత్వం నిర్మించనుంది. ఒక్కోదానిపై 350 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది.