Graduate MLC Elections : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు( graduate MLC elections) సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా జరగనుంది. అయితే గుంటూరు-కృష్ణా జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వచ్చింది. తొలుత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని అంతా భావించారు. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అడ్డగోలుగా ఓట్లను చేర్చుతున్నారని ఆరోపిస్తూ ఎన్నికను బహిష్కరించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం గుంటూరు కృష్ణాజిల్లాల నుంచి ఆలపాటి రాజాను బరిలోకి దించింది. గోదావరి జిల్లాలకు సంబంధించి పేరాబత్తుల రాజశేఖర్ పేరును ఖరారు చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బరిలో లేకున్నా.. ప్రజా సంఘాల నుంచి పిడిఎఫ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో ఒక రకమైన పోటీ నడుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
* వైసిపి ముఖ్య నేతలతో సమావేశం
అసెంబ్లీ సమావేశాలకు( assembly sessions ) హాజరయ్యేందుకు బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అటు తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా సమీక్ష చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బరిలో లేదు కానీ.. కూటమి అభ్యర్థులను ఓడించేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అందుకే ఈసారి టిడిపి అభ్యర్థులను ఓడించి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని సంకేతాలు పంపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
* పిడిఎఫ్ అభ్యర్థికి మద్దతు
మరోవైపు కృష్ణా- గుంటూరు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల స్థానం నుంచి బరిలో దిగిన సిట్టింగ్ ఎమ్మెల్సీ, పిడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణ్ రావుకు( PDF Candidate Laxman Rao) మద్దతు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. గతంలో లక్ష్మణరావు మనకు సహకరించారని.. ఇప్పుడు ఆయనకు మద్దతుగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను ఓడించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా సమన్వయంగా వ్యవహరించాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆలపాటి రాజా గెలవకూడదని జగన్మోహన్ రెడ్డి గట్టి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఈ ఓటమితో గట్టిగానే బుద్ధి చెప్పాలని కూడా అన్నట్లు సమాచారం.
* ఆ కారణాలతో పట్టు బిగిస్తున్న వైసిపి
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల స్థానంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇక్కడ టిడిపి తో పాటు కూటమిలో సమన్వయ లోపం ఉందని నివేదికలు అందినట్లు సమాచారం. ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు టిడిపిలోనే వ్యతిరేక నాయకులు ఉన్నారని.. వారంతా ఎన్నికల్లో ఆయనకు సహకరించరని తెలుస్తోంది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పిడిఎఫ్ అభ్యర్థికి మద్దతు ప్రకటించి.. అనూహ్యంగా ఆయన గెలుపు బాధ్యతలను తమ మీద పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇక్కడ ఫలితం తేడా కొడితే టిడిపి కూటమి ప్రభుత్వం ప్రమాదంలో పడినట్టే. అందుకే సీఎం చంద్రబాబు ఛాన్స్ ఇవ్వరని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.