Jaganmohan Reddy : అనూహ్యంగా మంగళవారం వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఒక పత్రిక ప్రకటన విడుదలైంది. అందులో ” పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శాసన మండల సభ్యులు శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడమైనది. పార్టీ క్రమశిక్షణ కూలంకనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుల మేరకు పార్టీ అధ్యక్షులు వారు ఈ నిర్ణయం తీసుకోవడం అయినది.. పార్టీ కేంద్ర కార్యాలయం” అని ఈ ప్రెస్ నోట్ లో ప్రస్తావించారు.. దువ్వాడ శ్రీనివాస్ అంతగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఏం పాల్పడ్డారు? ఉన్నట్టుండి జగన్మోహన్ రెడ్డి ఈ చర్యలు ఎందుకు తీసుకున్నారు? ఇలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అనే ప్రశ్నలు ఏపీ పొలిటికల్ సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు దువ్వాడ శ్రీనివాస్ – మాధురి వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆ విషయంపై జగన్మోహన్ రెడ్డి పెద్దగా స్పందించలేదు. దానిని పెద్దగా పట్టించుకోలేదు. పైగా మాధురి వ్యవహారంలో దువ్వాడ శ్రీనివాస్ కూతుర్లు, భార్య వివాదానికి తెర లేపినప్పటికీ.. ఓ వర్గం మీడియా ఈ విషయాన్ని తెగ హైలెట్ చేసినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి అంతగా స్పందించలేదు.
Also Read : ప్రజాక్షేత్రంలోకి జగన్.. అప్పటి నుంచే.. అమ్ములపొదిలో భారీ ప్లాన్స్!
బలమైన కారణం ఏమై ఉంటుంది..
దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేయడానికి బలమైన కారణం ఉందని వైసిపి నాయకులు చెప్తున్నారు. ఇటీవల కాలంలో పార్టీ వ్యవహారాలకు దువ్వాడ శ్రీనివాస్ దూరంగా ఉంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు విశాఖ రాజకీయాలలో చక్రం తిప్పిన దువ్వాడ శ్రీనివాస్.. పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత హైదరాబాద్ కే పరిమితమయ్యారు. దివ్వెల మాధురితో కలిసి హైదరాబాదులో ఓ చీరల దుకాణం ఏర్పాటు చేశారు. పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా టీవీ చానల్స్ ఆఫీసులు, యూట్యూబ్ ఛానల్స్ ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. దివ్వెల మాధురితో తన ప్రేమ సంగతులను చెప్పుకోవడం ప్రారంభించారు. కొన్ని చానల్స్ లో అయితే దివ్వెల మాధురిని ఆలింగనం చేసుకోవడం.. ఆమెకు ముద్దులు పెట్టడం వంటి చేష్టలకు పాల్పడ్డారు. పార్టీ అధినాయకత్వానికి కూడా దువ్వాడ శ్రీనివాస్ దూరంగా ఉండటం.. కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం వంటి విషయాలు జగన్ చెవిన పడ్డాయని.. అందువల్లే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని తెలుస్తోంది. అయితే పేరుకు సస్పెండ్ మాత్రం కాదని.. దాదాపు పార్టీ నుంచి తొలగించి నట్టేనని కార్యకర్తలు అంటున్నారు. అయితే గత ఏడాది ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్ సంచలన కామెంట్స్ చేశారు. తనను పార్టీ నుంచి తొలగించినా పర్వాలేదని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ నాడు చేసిన వ్యాఖ్యలకు.. వైయస్ జగన్మోహన్ రెడ్డి వాస్తవ రూపం ఇవ్వడం విశేషం. ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. పార్టీ నుంచి కీలక నేతలు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వేటు పడింది. మొత్తంగా చూస్తే వైసీపీలో అసెంబ్లీ ఎన్నికల ఓటమి అనేక కుదుపులకు కారణమవుతున్నదని తెలుస్తోంది.
Also Read : ప్రభుత్వం వ్యతిరేకత పెంచుతానంటున్న జగన్.. ఎలా అంటే?