Andhra Pradesh : ఏపీలో( Andhra Pradesh) బంగారం, వజ్రాలు, మాంగనీసు, సున్నపురాయి నిక్షేపాల వేట మొదలైంది. ఎందుకు సంబంధించి ఏపీ గనుల శాఖ కీలక ప్రకటన చేసింది. శ్రీ సత్య సాయి, అనంతపురం, విజయనగరం, కడప జిల్లాలో అన్వేషణ కోసం టెండర్లు ఆహ్వానించారు. జూన్ 6 వరకు బిడ్లు స్వీకరిస్తారు. ఈ టెండర్లలో ఎవరు గెలుస్తారో.. ఎక్కడెక్కడ నిక్షేపాలు బయట పడతాయో చూడాలి. రాష్ట్రంలో మేజర్ మినరల్స్ పరిధిలో ఉన్న మొత్తం ఏడు బ్లాక్ లకు టెండర్లు నిర్వహించడానికి కేంద్ర గనుల శాఖ అనుమతి ఇచ్చింది. నాలుగు జిల్లాల్లో ఈ టెండర్లు జరగనున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గనుల శాఖ ఈ తరహా టెండర్లను జారీ చేయడం ఇదే తొలిసారి.
Also Read : ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ.. కూటమి సర్కార్ సంచలన నిర్ణయం!
* భారీగా భూమి లీజుకు..
శ్రీ సత్య సాయి జిల్లాలోని( Shri Satya Sai district ) రామగిరి ఉత్తర, దక్షిణ బ్లాక్లో బంగారం కోసం వెయ్యి హెక్టార్ల చొప్పున స్థలాన్ని కేటాయించారు. ఇక్కడ బంగారం అన్వేషణ కోసం కాంపౌండింగ్ లైసెన్స్ మంజూరుకు బిడ్లు ఆహ్వానించారు. అనంతపురం జిల్లాలోని పెన్నా అహోబిలం దగ్గర 100 హెక్టార్లలో వజ్రాల కోసం తవ్వకాలు జరుపుతారు. దీనికి కూడా బిడ్లు పిలిచారు. కడప జిల్లాలోని మైలవరం, పెద్దముడియం మండలాల్లో సున్నపురాయి లీజుల కోసం బిడ్లు ఆహ్వానించారు. మైలవరంలోని మాధవపురంలో 697 హెక్టార్లు, పెద్దముడియం లోని భీమగుండంలో 698 హెక్టార్లలో సున్నపురాయి కోసం బిడ్లు పిలిచారు.
* మాంగనీసుకు సైతం
అలాగే విజయనగరం జిల్లాలో( Vijayanagaram district) శివన్న దొర వలస, పెద్ద లింగాల వలసలు మాంగనీస్ కోసం టెండర్లు పిలిచింది గనుల శాఖ. శివన్న దొర వలసలో 420 హెక్టార్లు, పెద్ద లింగాల వలసలు 476 హెక్టార్లలో మాంగనీస్ అన్వేషణ చేస్తారు. టెండర్ దక్కించుకున్న వారు ఆ విస్తీర్ణం పరిధిలోనే ఖనిజాన్వేషణ చేయాల్సి ఉంటుంది. అంత మేరకు మాత్రమే లీజులకు ఇస్తారు. అంతకుమించి తవ్వకాలు కూడా జరపరాదు.
* కేంద్ర గనుల శాఖ అనుమతి..
కేంద్ర గనుల శాఖ అనుమతి ఇచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి అనేది గుర్తించింది. ఆ ప్రక్రియ కొలిక్కి వచ్చిన తర్వాత ఇప్పుడు టెండర్లకు సిద్ధపడింది. వీలైనంత త్వరగా ఈ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తోంది. ఔత్సాహిక సంస్థలు, ఖనిజ తవ్వకాల్లో అనుభవం ఉన్న సంస్థలు ఈ బిడ్లను దక్కించుకునే అవకాశం ఉంది.
Also Read : ఏపీలో ఈశాన్య రాష్ట్రాల బస్సులు.. రూ.82.14 కోట్లకు టెండర్!