YS Jaganmohan Reddy : జగన్ గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టనున్నారా? పోయిన చోటే వెతుక్కోవాలని భావిస్తున్నారా?తిరిగి ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన జగన్ ఐదేళ్లుగా ఎంతో బలంగా కనిపించారు. కానీ ఎన్నికల్లో మాత్రం దారుణంగా ఓడిపోయారు. 151 స్థానాలు కాస్త 11 సీట్లకు తగ్గుముఖం పట్టాయి. కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు. పార్టీ నుంచి నాయకులు బయటకు వెళ్తున్నారు. ఇంకోవైపు కేసులతో పార్టీ శ్రేణులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.ఇటువంటి తరుణంలో మరో అడుగు ముందుకు వేయాలని భావిస్తున్నారు జగన్. పార్టీ ఆవిర్భవించిన ఈ పదేళ్లలో జగన్ జనాల మధ్య ఉండేవారు.కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జనం దూరమయ్యారు.అదే జనం మధ్యలోకి రావడానికి భయపడ్డారు. అయితే మరోసారి లోపాలను సరిదిద్దుకొని ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలనుకుంటున్నారు జగన్. ఎందుకు వస్తున్న సంక్రాంతిని ముహూర్తంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్త పర్యటనలకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.
* ప్రభుత్వానికి సమయం ఇవ్వకూడదని
కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది.అందుకే ఈసారిప్రభుత్వానికి సమయం ఇవ్వకూడదని జగన్ భావిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులపాటు ఉండేలా పర్యటనలను చేయనున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాల్లో జగన్ పర్యటనలు సాగనున్నట్లు తెలుస్తోంది.జనవరి మూడో వారం తరువాత జగన్ జనంలోకి వెళ్ళబోతున్నట్లు సమాచారం.పార్టీ బలోపేతంపై సామాన్య కార్యకర్తల సూచనలు, సలహాలను సైతం తీసుకొన్నారు.మరోవైపు తాడేపల్లిలో తనను కలిసేందుకు వచ్చిన వారిని తప్పనిసరిగా కలిసేందుకు ప్రజా దర్బార్ ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి వచ్చినా తనను అపాయింట్మెంట్ తో పని లేకుండా కలిసేలా ఏర్పాటు చేస్తున్నారు.
* ప్రజా దర్బార్ల నిర్వహణ
గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు ప్రజాదర్బార్లు నిర్వహించాలని జగన్ భావించారు. కానీ భద్రతాపరమైన అంశాలు తెరపైకి రావడంతో విరమించుకున్నారు.అయితే గతంలో ప్రజాదర్బార్లు వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఎంతగానో పేరు తీసుకొచ్చాయి. అందుకే మరోసారి ప్రజాదర్బార్లు నిర్వహించేందుకు జగన్ సిద్ధపడుతున్నారు. ఒకవైపు క్షేత్రస్థాయిలో పర్యటనలు, ఇంకోవైపు ప్రజాదర్బార్లతో ప్రజల నుంచి వినతులు స్వీకరించడం వంటివి చేపట్టనున్నారు. తద్వారా ప్రజల మనసులో అభిమానాన్ని పొందాలని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే సంక్రాంతి తర్వాత ప్రజాక్షేత్రంలో అడుగు పెడతారు జగన్. దీంతో పార్టీ శ్రేణులు ఒక రకమైన ఆనందం కనిపిస్తోంది.