CM Jagan: గత ఎన్నికల్లో జగన్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. దాదాపు 5 ఏళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు. నిత్యం జనంలోనే గడిపారు. పొలాలకు వెళ్లారు. రైతులతో మమేకం అయ్యేందుకు బురదలో దిగి సైతం పనిచేశారు. సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు. పేదలు, ధనికులు అన్న తేడా లేకుండా అందర్నీ కలిశారు. ఆయన శ్రమ ఫలించింది. ఆయన పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన సీఎం అయ్యారు కూడా. అయితే అప్పటి నుంచి జనం అన్నమాట మరిచిపోయారు. జనాన్ని కలిసేందుకు ఇష్టపడలేదు కూడా.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా ఎంటర్ అయ్యింది. ఆ పేరుతోనే ఆయన రెండేళ్ల పాటు తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమయ్యారు. అటు తరువాత ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం ఉన్నా ఆ పని చేయలేదు. పూర్తిగా ప్యాలెస్ కి అంకితమయ్యారు. అప్పటివరకు ఉత్త గోడలతో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ కు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి హంగులు ఏర్పాటు చేసుకున్నారు. ప్రైవేటు ఇంటికి ఇలా ఖర్చు పెట్టేందుకు ఏ ముఖ్యమంత్రి సాహసించలేదు. కానీ తన రాజకీయ స్నేహితుడు కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకున్నారు. 200 కోట్ల రూపాయలతో తాడేపల్లి ప్యాలెస్ ను అందంగా తీర్చిదిద్దారు. ఆ ప్యాలెస్ లో విలాసవంతమైన జీవితాన్ని కొనసాగించారు.
2023 చివరిలో జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. అప్పటివరకు జిల్లాలను చూసేందుకు కూడా ఇష్టపడలేదు. తన సామాజిక వర్గ నేతల ఇంట్లో శుభకార్యాలకు, పరామర్శలకు మాత్రమే ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేవారు. తనకు తాను చక్రవర్తిగా భావించే ఆయన ప్రజలను కలిసేందుకు ఇష్టపడలేదు. పరదాల మాటున పర్యటనలు, ఆంక్షలు నడుమ సందర్శనలకు ఐదేళ్ల కాలాన్ని వెచ్చించారు. ప్రజలంటే ఒక రకమైన అసహనం ప్రదర్శించేవారు. మొదట్లో సలహాదారులు అత్యుత్సాహంతో ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని ప్రకటించారు. అయితే జగన్ చీవాట్లు పెట్టి మరి వాయిదా వేయించారు. తాను ఎవర్ని కలిసేది లేదని తేల్చి చెప్పారు. చివరకు పార్టీ ఎమ్మెల్యేలకు సైతం దర్శన భాగ్యం కల్పించలేదు. అటువంటప్పుడు ఈ పదవి ఎందుకని ఎమ్మెల్యేలు నిట్టూర్చాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ మధ్యన జ్యోతిష్యుడు వేణు స్వామి సైతం జగన్ కెసిఆర్ ను అనుసరిస్తారని చెప్పుకొచ్చారు. అయితే అది పాలనలోనా? ఓటమిలోనా? అన్నది తెలియాల్సి ఉంది. కెసిఆర్ సైతం ప్రగతి భవన్ కట్టుకున్నారు. అందులో ఉండి ఎవరినీ కలిసేందుకు ఇష్టపడలేదు. చివరకు సీఎం ప్రజలను కలవాల్సిన అవసరం ఏమిటని కేటీఆర్ సమర్ధించుకున్నారు. ఆయన కెసిఆర్ కుమారుడు కాబట్టి అలా అనుకున్నా తప్పులేదు. కానీ ప్రజలు అలా భావించలేదు. తప్పు అన్న నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఓటమి బాట పట్టించారు. ఇప్పుడు జగన్ విషయంలో తప్పు అన్న నిర్ణయానికి వస్తే మాత్రం అందుకు మూల్యం తప్పదు.