https://oktelugu.com/

Haryana: బాల రాముడి ప్రాణ ప్రతిష్ట.. హర్యానాలో మాటల కందని విషాదం..

అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా రామాలయాల్లో వేడుకలు నిర్వహించారు. అన్నదానాలు, హోమాలు, రాముడికి యజ్ఞాలు, ఇతర ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలు నిర్వహించారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 23, 2024 / 01:11 PM IST

    Haryana

    Follow us on

    Haryana: అయోధ్య లోని రామ మందిరంలో సోమవారం బాల రాముడు విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగింది. రాముడికి హారతి ఇచ్చిన అనంతరం ఆయన సాష్టాంగ ప్రమాణం చేశారు. అనంతరం రాముడి గురించి ఉద్వేగంగా మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని భారత దేశంలో ఉన్న భారతీయులు, ఇతర దేశాలలో స్థిరపడిన భారతీయులు వెయ్యి కళ్ళతో చూశారు. తమ జన్మ సుకృతమైందని ఆనందపడ్డారు. అయితే ఇంతటి మహాక్రతువు జరుగుతున్న వేళ హర్యానా రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా రామభక్తులు దుఃఖంలో మునిగిపోయారు.

    అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా రామాలయాల్లో వేడుకలు నిర్వహించారు. అన్నదానాలు, హోమాలు, రాముడికి యజ్ఞాలు, ఇతర ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలు నిర్వహించారు. రాముడు కొలువై ఉన్న భద్రాచలం, ఒంటిమిట్ట ప్రాంతాలలో ఉత్సవమూర్తులను ఊరేగించారు. భక్తుల కోసం ప్రత్యేకంగా దర్శనాలు ఏర్పాటు చేశారు. అన్నదానాలు కూడా నిర్వహించారు. ఇదే తీరుగా ఉత్తర భారతంలోని హర్యానా రాష్ట్రంలోనూ వేడుకలు నిర్వహించారు. పైగా ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో వేడుకలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో హర్యాన రాష్ట్రంలోని భివానీ ప్రాంతంలో రామ్ లీలా నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు.. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో ఈ నాటకాన్ని చూసేందుకు భారీగా జనం వచ్చారు. వచ్చిన భక్తుల కోసం నిర్వాహక కమిటీ భారీగానే ఏర్పాట్లు చేసింది. నారింజ రసం, అన్న ప్రసాదం వితరణ చేసింది. దీనిని బిజెపి నాయకులు అంగరంగ వైభవంగా నిర్వహించడంతో జనాలు కూడా ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చారు.

    రామాయణంలోని ఒక ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకుని స్థానికంగా ఉన్న కళాకారులు నాటకాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో హనుమంతుడి పాత్రధారి హరీష్ అనే వ్యక్తి తన వంతు ప్రదర్శన ఇస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ఆయన కుప్పకూలిపోయారు.. చూస్తున్నవారు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. స్టేజీ మీద ఉన్న కళాకారులు కూడా ఇది నాటకంలో భాగం అనుకున్నారు. తమ వంతు పాత్రను వారు పోషిస్తున్నారు. ఒక కళాకారుడు వచ్చి హనుమంతుడి పాత్రధారిని పైకి లేపగా ఎంతకీ లేవలేదు. దీంతో అక్కడ ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా మౌనం దాల్చారు . వేదిక మీద ఉన్న కళాకారుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఆ హనుమంతుని పాత్రధారుడిని లేపడానికి ప్రయత్నించగా ఏమాత్రం అతడు పైకి లేవలేదు. శ్వాస తీసుకోవడం ఆగిపోవడంతో కంగారు పడిన ఆ కళాకారులు అతడిని నిర్వాహక కమిటీ సభ్యుల తోడ్పాటుతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. రక్షించిన వైద్యులు అతడు చనిపోయారని నిర్ధారించారు. నాటకంలో భాగంగా అతడు ఉత్సాహంగా కదలడం.. సుదీర్ఘమైన డైలాగులు చెప్పడంతో అది గుండెపై ఒత్తిడి పెంచిందని.. ఫలితంగా అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కాగా రామ మందిరం ప్రతిష్ట నేపథ్యంలో హనుమంతుడి పాత్రధారి గుండెపోటుతో కన్నుమూయడం పట్ల రామభక్తులు విషాదం మునిగిపోయారు. కాగా హనుమంతుని పాత్ర వేసి గుండెపోటుతో చనిపోయిన హరీష్ కుటుంబానికి అండగా ఉంటామని నిర్వహణ కమిటీ సభ్యులు, బిజెపి నాయకులు ప్రకటించారు.