Jagan: సింహాచలంలో( Simhachalam) గోడ కూలిన ఘటనలో 8 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం విచారకరం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. విచారణకు ఆదేశించింది. ఒక్కో మృతుడి కుటుంబానికి పాతిక లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి దేవాదాయ శాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని కూడా చెప్పింది. అయితే ఈ ఘటన దురదృష్టకరం. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు వీయడంతో ఈ ఘటన జరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని వైయస్సార్ కాంగ్రెస్ నేత జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: ఆ వైసీపీ మాజీ ఎంపీ రాజకీయ నిష్క్రమణ!
* రాజకీయాలు దురదృష్టకరం..
అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాజకీయాలు( politics) చేయడం దురదృష్టకరం. తిరుపతి తొక్కిసలాట సమయంలో సైతం ఇదే మాదిరిగా రాజకీయ కీచులాట జరిగింది. ఇప్పుడు కూడా అదే ప్రారంభం అయ్యింది. అయితే ఈ ఘటనను నిర్లక్ష్యంగా చెప్పవచ్చు. మానవ తప్పిదంగా చెప్పవచ్చు. ఇటువంటి సమయంలో రాజకీయాలు చేయడం మాత్రం దురదృష్టకరంగా భావించవచ్చు. ప్రభుత్వాలు, యంత్రాంగానికి సంబంధం లేకుండా చాలా రకాల ఘటనలు జరుగుతాయి. దురదృష్టకరమైన ప్రమాదాలు ఎదురవుతాయి. అయితే ఉద్దేశపూర్వకంగా ఏ ప్రభుత్వము నిర్లక్ష్యం చేయదు. అలా అనుకుంటే విశాఖలో ఎల్జి కెమికల్స్ లో భారీ ప్రమాదమే జరిగింది. దానికి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. పది నెలల కిందటి వరకు వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉందన్న విషయాన్ని గ్రహించుకోవాలి. అయినదానికి కాని దానికి ఈ ప్రభుత్వమే అంటూ చెప్పడం కూడా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా మారుతుంది. సింహాచలం షాపింగ్ కాంప్లెక్స్ గోడ కూడా.. వైసిపి పాపమేనని రికార్డులు చెబుతున్నాయి.
* దేవాదాయ శాఖ పరిధిలో దేవస్థానం..
సింహాచలం అప్పన్న చందనోత్సవం అంటే ఎంతో ప్రాముఖ్యత కలిగినది. దేవాదాయ శాఖ( endowment department) పరిధిలో ఉన్న ఈ దేవస్థానం విషయంలో ప్రభుత్వ బాధ్యత ఎంతో ఉంది. ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం తప్పిదం ఉంటే కచ్చితంగా ప్రశ్నించాలి. కానీ సీఎం చంద్రబాబు వల్లేనని ప్రచారం చేయడం జగన్మోహన్ రెడ్డి స్థాయికి మాత్రం తగదు. ముఖ్యంగా సమస్యలపై వైయస్సార్ కాంగ్రెస్ పోరాటం చేయడం లేదన్న విమర్శ ఉంది. ప్రధానంగా ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు, ప్రాణ నష్టం జరిగినప్పుడు మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగుతుందన్న అపవాదు ఉంది. ఇటువంటి తరుణంలో సింహాచలం ప్రమాదంలో చనిపోయిన 8 మంది విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రాజకీయం చేస్తుందని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అయితే ప్రభుత్వ వైఫల్యం ఉంటే నిలదీస్తే పర్వాలేదు కానీ.. అదే పనిగా ప్రచారం చేస్తే వికటించడం ఖాయం.
* అవన్నీ వట్టి మాటలే..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో చాలా రకాల ప్రమాదాలు జరిగాయి. అప్పట్లో ప్రభుత్వం తరఫున పరిహారం ప్రకటించారు. అయితే అప్పటి విపక్షం తాము అధికారంలోకి వస్తే.. దీనికి రెట్టింపు పరిహారం అందిస్తామని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చాక దాని గురించి మరిచిపోయారు. అటు బాధిత కుటుంబాలు సైతం ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున అందిస్తామని చెబుతున్నారు. కానీ నిజంగా అందిస్తారా? అంటే మాత్రం సమాధానం ఉండదు. ప్రమాదాలు జరిగినప్పుడు పొలిటికల్ స్టంట్ లు ఉంటాయి. అవి రాజకీయాల వరకే పని చేస్తాయి. బాధిత కుటుంబాలకు ఎటువంటి స్వాంతన ఉండదు. కేవలం ఆ ఘటనలు రాజకీయంగానే అక్కరకు వస్తాయి కానీ.. ఇంకేమీ ఉండదు.
Also Read: రిజిస్ట్రేషన్ ఫీజులో భారీ రాయితీ.. ఏపీ సర్కార్ గుడ్ న్యూస్!