Rushikonda Jagan Palace: జగన్ రాజసౌధంలో.. ప్రతి నిర్మాణం ప్రత్యేకమే

కళింగ బ్లాక్ లో రెండు భవనాలను సీఎం కార్యాలయం కోసం నిర్మించారు. గజపతి, వేంగి బ్లాక్ లను సహాయ సిబ్బంది, ఇతర అధికారుల కోసం నిర్మించారు.

Written By: Dharma, Updated On : June 17, 2024 8:51 am

Rushikonda Jagan Palace

Follow us on

Rushikonda Jagan Palace: ఇప్పటి వరకు రాజులు, రాజ భవనాలు, రాజ సౌధాలు గురించి కథలుగా తెలుసుకున్నాం. కానీ తొలిసారి విశాఖలో జగన్ కట్టిన రుషికొండ రాజ సౌధంలో నిర్మాణాలు గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతోంది.ప్రతి నిర్మాణం ప్రత్యేకమే. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నది. ఈ భవనాల్లో అంతర్గత అలంకరణల కోసం ఏకంగా 1312 రకాల వస్తువులను వినియోగించారు. శ్వేత వర్ణంతో మెరిసిపోతున్న భవంతులు, భారీ ప్రవేశ ద్వారాలు, విలాసమైన పడక గదులు, వాటికి ఏమాత్రం తీసుకొని స్నానాలు గదులు.. ఇలా అన్నీ ప్రత్యేకమే. కేవలం భవనాలే కాదు.. ప్రాంగణమంతా ఖరీదైన పచ్చికలు, విలాసమైన లాన్లు, సుందరమైన ఉద్యానవనాలను తీర్చిదిద్దారు. కనుచూపుమేరలో విశాలమైన నీలి సముద్రం సోయగాలు కనిపించేలా డిజైన్లు తీర్చిదిద్దారు.

కళింగ బ్లాక్ లో రెండు భవనాలను సీఎం కార్యాలయం కోసం నిర్మించారు. గజపతి, వేంగి బ్లాక్ లను సహాయ సిబ్బంది, ఇతర అధికారుల కోసం నిర్మించారు. భవనాలను భారీ స్తంభాలు, ప్రాకారాలతో ఇంద్ర భవనాల తీర్చిదిద్దారు. భవనాలను అనుసంధానిస్తూ విశాలమైన నడవాలు నిర్మించారు. అన్ని గోడలకు విదేశాల నుంచి తెచ్చిన పాలరాయి తాపడం చేశారు. ఏ భవనం చూసినా శ్వేత, ముదురు గోధుమ వర్ణాలతో మెరిసిపోయేలా తీర్చిదిద్దారు. ప్రవేశ ద్వారాలను వదడుగుల ఎత్తులో, అంతే వెడల్పుతో భారీగా ఏర్పాటు చేశారు. వాటికి ఇరువైపులా పాలరాయి నిర్మాణాలతో కూడిన ఎత్తైన ఆకృతులను చెక్కారు.

బాత్రూములకు సైతం సెంట్రలైజ్డ్ ఏసి ఏర్పాటు చేశారు. భవనాల్లో వినియోగించిన ఫ్యాన్లు, షాండ్లియర్లు, ఇతర పరికరాలను ఏర్పాటు చేశారు. ఒక్క ఫ్యాన్ ధర రూ.35 వేల నుంచి ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. షాండ్లియర్ల ధర ఒక్కొక్కటి 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది. 12 బెడ్ రూములు వేరువేరుగా మంచాలు ఏర్పాటు చేశారు. ఈ గదులకు చుట్టూ ఆటోమేటిక్ అద్దాల తలుపులు, బయట నుంచి ఎండ లోపలికి రాకుండా ఆటోమేటిక్ కర్టెన్లు ఏర్పాటు చేశారు. హాలుకు రెండు వైపులా భారీ సోఫా సెట్లు ఏర్పాటు చేశారు. ఓపెన్ కిచెన్, సముద్రాన్ని చూస్తూ భోజనం చేసేలా డైనింగ్ హాల్ నిర్మించారు. రెండు వైపులా అతిథులు, సన్నిహితులతో ఏకాంతంగా మాట్లాడుకునేందుకు మరో రెండు గదులను నిర్మించారు.

బాత్రూముల గురించి ఎంత చెప్పినా తక్కువే. వాటిలో ప్రత్యేకంగా స్పా ఏర్పాట్లు చేశారు. కమోడ్లు, షవర్లు, కుళాయిలు అన్ని ప్రసిద్ధ జపాన్ కంపెనీలకు చెందినవే. బాత్రూంలో భారీ కబోర్డులు ఏర్పాటు చేశారు. 100 అంగుళాల భారీ టీవీలను సైతం అమర్చారు. విదేశాల నుంచి తెప్పించిన మార్బుల్, గ్రానైట్ ను మాత్రమే వినియోగించారు. ఇక జగన్ కుటుంబం కోసం నిర్మించిన మూడు జిల్లాలు సముద్రానికి అభిముఖంగా ఉన్నాయి. పూర్తి విదేశీ పరిజ్ఞానంతోనే ఈ నిర్మాణాలు సాగినట్లు తెలుస్తోంది.