TDP: విశాఖకు ప్రాధాన్యం.. స్పీకర్ గా అయ్యన్న.. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా

TDP తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అయ్యన్నపాత్రుడు ఆ పార్టీలో కొనసాగుతున్నారు. ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా ఎన్నడూ పార్టీని విడిచిపెట్టలేదు.

Written By: Dharma, Updated On : June 17, 2024 8:57 am

TDP

Follow us on

TDP: విశాఖ జిల్లాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆ జిల్లాకు ప్రభుత్వంతో పాటు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ స్పీకర్ గా నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎంపిక చేశారు. టిడిపి గెలిచిన ప్రతిసారి.. క్యాబినెట్లో అయ్యన్నకు చోటు దక్కడం పరిపాటిగా వస్తోంది. కానీ ఈసారి చంద్రబాబు అయ్యన్నను క్యాబినెట్లోకి తీసుకోలేదు. ఇప్పుడు స్పీకర్ గా ఎంపిక చేయడం విశేషం. మరోవైపు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యాదవ్ ను టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో శ్రీనివాస్ యాదవ్ విజయం సాధించారు. మంత్రి పదవిని ఆశించారు. సామాజిక సమీకరణలో భాగంగా ఆయనకు చాన్స్ ఇవ్వలేదు చంద్రబాబు. ఇప్పుడు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అయ్యన్నపాత్రుడు ఆ పార్టీలో కొనసాగుతున్నారు. ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా ఎన్నడూ పార్టీని విడిచిపెట్టలేదు. 1983లో తొలిసారిగా పోటీ చేసిన అయ్యన్నను.. 1994లో ఎన్టీఆర్ తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. అప్పటినుంచి టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిసారి అయ్యన్న మంత్రి పదవి దక్కించుకుంటూ వచ్చారు. ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబుతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత ఐదు సంవత్సరాలుగా జగన్ సర్కార్ తో దూకుడుగా కనబడిన నేతల్లో అయ్యన్నపాత్రుడు ఒకరు. ఆయన కుమారుడు విజయ్ ఐ టీడీపీ బాధ్యతలు చూసుకునేవారు. ఈ క్రమంలో తండ్రి కొడుకుల మీద జగన్ సర్కార్ ఎన్నో రకాల కేసులు వేసింది. అరెస్టు చేయాలని కూడా ప్రయత్నించింది. ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా.. కుమారుడు విజయ్ ను బరిలో దించాలని అయ్యన్న ఆశించారు. కానీ చంద్రబాబు మాత్రం అయ్యన్నపాత్రుడుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో అంత మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావించారు. కానీ అయ్యన్న అనుభవాన్ని స్పీకర్ గా వాడుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు.

ఇప్పటివరకు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెనాయుడు ఉండేవారు. కానీ ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆయన స్థానంలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని చంద్రబాబు భావించారు. అప్పుడే పల్లా శ్రీనివాస్ పేరును పరిగణలోకి తీసుకున్నారు. పల్లా కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. పైగా టిడిపి తోనే అనుబంధం ఎక్కువ. 1994లో విశాఖ-2 ఎమ్మెల్యేగా పల్లా సింహాచలం గెలిచారు. ఆయన కుమారుడే శ్రీనివాసు యాదవ్. 2014 ఎన్నికల్లో గాజువాక నుంచి గెలిచారు ఆయన. 2019లో మాత్రం ఓడిపోయారు. టిడిపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసును పార్టీ మారాలని వైసీపీ నుంచి డిమాండ్ వచ్చింది. ఆయన వెనకపోవడంతో కక్ష సాధింపు చర్యలు కూడా జరిగాయి. కానీ వాటిని లెక్క చేయలేదు. ఎన్నికల్లో పోటీ చేసిన ఆయనకు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ లభించింది. అందుకే చంద్రబాబు మంత్రివర్గంలో కాకుండా.. పార్టీ అధ్యక్ష పదవితో ఆయనకు పదోన్నతి కల్పించారు.

సీఎం చంద్రబాబు విశాఖ జిల్లాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. ఉమ్మడి విశాఖ జిల్లాలో వంగలపూడి అనితకు మాత్రమే మంత్రి పదవి దక్కింది. విశాఖ నగరానికి సంబంధించి ఎటువంటి ప్రాతినిధ్యం లేదు. అందుకే గాజువాక ఎమ్మెల్యేగా ఉన్న పల్లా శ్రీనివాస్ కు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉన్న అయ్యన్నపాత్రుడికి స్పీకర్ పదవికి ఎంపిక చేశారు. ఈ లెక్కన ఉమ్మడి విశాఖ జిల్లాకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు అయ్యింది. స్పీకర్ పదవి అయ్యన్నకు ఇవ్వాల్సి ఉండడంతోనే.. విశాఖలో మరో మంత్రి పదవి కేటాయించలేదని తెలుస్తోంది. మొత్తానికి విశాఖకు అత్యంత ప్రాధాన్యం దక్కడంతో టిడిపి శ్రేణుల్లో ఒక రకమైన ఆనందం కనిపిస్తోంది.