https://oktelugu.com/

Jagan: చంద్రబాబును ట్రాప్ చేసే పనిలో జగన్!

ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. ఏపీ విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందిస్తోంది. అయితే ఇదే అదునుగా చాలా విషయాలను తెరపైకి తెస్తున్నారు జగన్. చంద్రబాబుకు ట్రాప్ చేసే పనిలో పడ్డారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 1, 2024 / 10:16 AM IST

    Jagan(5)

    Follow us on

    Jagan: పోలవరం ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉంది. కేంద్ర ప్రభుత్వం సైతం సానుకూలంగా స్పందించింది. అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. అంతవరకు ఓకే కానీ మరోసారి పోలవరం ప్రాజెక్టును రాజకీయం చేసే పనిలో పడింది వైసిపి. ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం చవిచూసింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ తరుణంలో ఏపీలో ఎలా పుంజుకోవాలి అని ఆలోచిస్తోంది వైసిపి. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచడంలో పోలవరం ప్రాజెక్టు ఒక అస్త్రంగా మారింది అప్పటి విపక్షాలకు. ఇప్పుడు అదే పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని టిడిపి కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తోంది వైసిపి. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్న టిడిపి ఈ విషయంలో ఏం చేస్తున్నట్టు అని జగన్ ప్రశ్నిస్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారని.. అయినా చంద్రబాబు స్పందించడం లేదని వైసీపీ అధినేత తాజాగా ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచిగా నిలిచే పోలవరం విషయంలో చంద్రబాబు చేస్తున్న నిర్లక్ష్యం రాష్ట్రానికి శాపంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు జగన్. పోలవరం ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 45.72 మీటర్లకే సవరించిన అంచనాలకు ఒప్పించాలని ఆయన తాజాగా డిమాండ్ చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ట్విట్ చేశారు.

    * డిజైన్ మార్చేశారా?
    వాస్తవానికి పోలవరం గరిష్ట ఎత్తు 45.72 మీటర్లుగా డిజైన్ చేశారు. అయితే దానిని 41.15 మీటర్లకు తగ్గించారన్నది వైసీపీ నుంచి వస్తున్న ఆరోపణ. దీంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుందని.. 194.6 టీఎంసీలు ఉండాల్సిన నీటి నిల్వ.. 115 టీఎంసీలకే పడిపోతుందని వైసిపి కొత్త వాదనలను తెరపైకి తెచ్చింది. నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెబుతోంది. ఎత్తు తగ్గింపు వల్ల కుడి ఎడమ ప్రధాన కాలువల పరిధిలో శివారు ఆయకట్టుకు నీరు అందదని ఆందోళన వ్యక్తం చేస్తోంది వైసిపి.

    * అవే డిమాండ్లు
    అయితే 2018లో తెచ్చిన డిమాండ్లను జగన్ తెరపైకి తేవడం విశేషం. అప్పట్లో విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేలేకపోయారని జగన్ ఆరోపించారు.కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న ఏపీకి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని జగన్ చెప్పుకొచ్చేవారు. పదేపదే ఎన్డీఏ నుంచి బయటకు రావాలని సవాల్ చేసేవారు. అదే సమయంలో వైసీపీ బీజేపీతో స్నేహానికి తహతహలాడేది. ఈ తరుణంలో చంద్రబాబు జగన్ ట్రాప్ లో పడ్డారు. వన్ ఫైన్ మార్నింగ్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారు. అప్పటినుంచి చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి కష్టాలు ప్రారంభమయ్యాయి. మరోసారి అదే వ్యూహంతో జగన్ ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. అయితే గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు వెనక్కి తగ్గుతారా? జగన్ ట్రాప్ లో పడతారా? అన్నది తెలియాల్సి ఉంది.