TDP And Jana Sena: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోంది. ఈ ఎన్నికల్లో కూటమి కట్టిన మూడు పార్టీలు సత్తా చాటాయి. వైసిపికి చాన్స్ లేకుండా చేశాయి. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.అందుకే ఏపీలో కూటమి మరో పదేళ్లపాటు కొనసాగాలని సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ బలంగా ఆకాంక్షిస్తున్నారు. అయితే పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడే కూటమి పార్టీల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. తెలుగుదేశం, జనసేన పార్టీ శ్రేణుల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న విషయాల్లోనూ గొడవలు తప్పడం లేదు. దెందులూరు నియోజకవర్గంలో అయితే టిడిపి, జనసేన శ్రేణులు పరస్పరం దారుణంగా దాడులు చేసుకున్నాయి. ఇందులో పలువురికి గాయాలయ్యాయి కూడా. దెందులూరు నియోజకవర్గం పైడిచింతపాడులో పింఛన్లను పంపిణీ చేశారు. అయితే అక్కడ సర్పంచ్ జనసేన మద్దతుదారుడు. టిడిపి శ్రేణులను పిలవకుండా ఏకపక్షంగా పింఛన్లు పంపిణీ చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో టిడిపి, జనసేన శ్రేణుల మధ్య వివాదం రేగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* గోదావరి జిల్లాలో అధికం
గోదావరి జిల్లాలో ఇప్పటికే టిడిపి, జనసేన ద్వితీయ శ్రేణి కార్యకర్తల మధ్య పలుచోట్ల గొడవలు జరుగుతున్నాయి. విభేదాలు తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం దెందులూరు ఎమ్మెల్యేగా చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. వివాదాలకు చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం టిడిపి శ్రేణులు ఊరుకోవడం లేదు. దీంతో ఘర్షణలు తలెత్తుతున్నాయి. అయితే రెండు అధికార పార్టీలే కావడంతో పోలీసులు సతమతమవుతున్నారు. ఎవరిపై కేసులో పెట్టాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
* అక్కడ టిడిపి క్యాడర్ కు నో ఛాన్స్
అయితే జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టిడిపి క్యాడర్ను పట్టించుకోవడం లేదు. మొన్నటికి మొన్న మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం పర్యటన సైతం వివాదాస్పదంగా మారింది. తమకు కనీస సమాచారం లేకుండా మంత్రి పర్యటన ఏర్పాటు చేయడాన్ని తమ్ముళ్లు ప్రశ్నించారు. నిలదీసినంత పనిచేశారు. దీంతో మంత్రిదుర్గేశ్ వారిని శాంతింపజేశారు.మరోసారి ఇలాంటివి జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. మొత్తానికి అయితే అధినేతలు మాత్రం రెండు పార్టీల మధ్య పొత్తు ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధ పరిస్థితులు ఉన్నాయి.