Jagan fire :  జగన్ ప్రతిపక్ష పాత్రలో లీనం.. ఇది కదా కావాల్సింది.. వైసీపీ శ్రేణుల ఖుషీ!

వైసీపీకి కోలుకోలేని ఓటమి.అసలు జీర్ణించుకోలేని అపజయం. 40 శాతం ఓట్లు సాధించినా.. సీట్ల పరంగా వెనుకబాటు. అసలు పార్టీ ఉంటుందా లేదా అన్న అనుమానం. అయినా సరేత్వరగా కోలుకున్నారు జగన్. ప్రతిపక్ష హోదా దక్కకున్నా.. ప్రతిపక్షంలో లీనమైన తీరు ఆకట్టుకుంటుంది.

Written By: Dharma, Updated On : July 22, 2024 4:47 pm
Follow us on

Jagan fire : జగన్.. సీఎంగా కంటే ప్రతిపక్ష నేతగానే ప్రజల్లోకి బలంగా వెళ్లారు. గత ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉంది వైసిపి. కానీ జగన్ అనుకున్నంత స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేకపోయారు. ప్రజలను మెప్పించలేకపోయారు. దాని ఫలితమే ఈ ఘోర పరాజయం. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారు జగన్. అందుకే ఓటమి నుంచి తేరుకొని అధికారపక్షంపై పోరాటం ప్రారంభించారు. ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టకూడదు అని భావిస్తున్నారు. అయితే ఇంత స్వల్ప కాలంలో జగన్ ప్రజాక్షేత్రంలో అడుగుపెడుతుండడంతో వైసీపీ శ్రేణులు ఒక రకమైన ఆనందం కనిపిస్తోంది. ఇది కదా మాకు కావాల్సింది అంటూ సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు. బాస్ ఇజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

* శాసనసభలో ఎంట్రీ అదుర్స్
ఈరోజు శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు జగన్. నలుపు రంగు దుస్తులతో ఎంట్రీ ఇచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పోలీసులు జగన్ తో పాటు వైసిపి ప్రజాప్రతినిధులను అడ్డుకున్నారు. కానీ పోలీసులను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జగన్ దూకుడుగా ముందుకు సాగారు. ప్రభుత్వంతో పాటు పోలీసులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ కామెంట్స్ 2014 నుంచి 2019 మధ్య జగన్ ను గుర్తుచేస్తున్నాయి. అదే సమయంలో గత ఐదు సంవత్సరాలుగా టిడిపి చేసిన పోరాటాన్ని జగన్ అనుసరిస్తున్నట్టు కనిపించారు. తద్వారా తన దూకుడు తనాన్ని బయటపెట్టారు. ఈ ఐదు సంవత్సరాల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని సంకేతాలు ఇచ్చారు.
* టిడిపి పోరాటాన్ని అనుసరిస్తూ..
గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ.. పవన్ ఆధ్వర్యంలోని జనసేన చాలా బాగా పోరాటం చేశాయి. ప్రభుత్వంపై చిన్నపాటి వ్యతిరేకత వ్యక్తం అయ్యే ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టలేదు. ప్రజా పోరాటం తో పాటు సోషల్ మీడియా వేదికగా కూడా పోరాటం చేశాయి. ప్రభుత్వ తీరును అడుగడుగునా ఎండగట్టాయి. ఒక్క పాలనాపరమైన అంశాలే కాకుండా రాజకీయపరమైనఅన్ని అంశాల్లో లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేశాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి. ప్రజలు కూడా ఆదరించారు. జగన్ కు వ్యతిరేకంగా నిలిచారు. తెలుగుదేశం కూటమికి అధికారంలోకి తెచ్చారు.అందుకే అదే తరహా పోరాటం చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.
* ఆది నుంచి అదే దూకుడు
ఆది నుంచి జగన్ కు దూకుడు వైఖరి కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైసిపి ఏర్పాటు వెనుక కూడా జగన్ దూకుడు ఉంది. 2014 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. 67 స్థానాలతో గౌరవప్రదమైన స్థితిలోనే తీర్పు ఇచ్చారు. అయితే అదే దూకుడుతో 2019 ఎన్నికల్లో సైతం ముందుకు సాగారు జగన్. అందుకే అధికారంలోకి రాగలిగారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ వైఖరి చాలా దూకుడుగా ఉండేది. ప్రజా సమస్యలపై నిగ్గదీసి, నిలదీసి అడిగే తీరు ప్రజలను ఆకట్టుకునేది. ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నంచేస్తున్నారు జగన్. ప్రతిపక్ష హోదా దక్కకున్నా.. ప్రతిపక్షంలో లీనం కావడంలో మాత్రం జగన్ సక్సెస్ అయ్యారు. ఇదే పంధా ఐదేళ్ల పాటు కొనసాగితేజగన్ విజయాన్ని అందుకోవడం ఖాయం.అది ఈ ఐదేళ్లపాటు పోరాడే విధానం పై ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.