AP Politics : అప్పటి కేసులకు.. ఇప్పుడు అరెస్టులు.. కుప్పం పోలీసుల అదుపులో యనమల!

వైసిపి ప్రభుత్వ హయాంలో చాలామంది అనామకులు సైతం నేతలుగా మారిపోయారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి హోదా జాబితాలో చేరిపోయారు. అటువంటి వారిలో యనమల నాగార్జున యాదవ్ ఒకరు. గతంలో చంద్రబాబు, పవన్, లోకేష్,వంగలపూడి అనితలపై చేసిన కామెంట్స్ నాగార్జున మెడకు చుట్టుకున్నాయి. కేసులు చుట్టుముడుతున్నాయి.

Written By: Dharma, Updated On : July 22, 2024 4:46 pm

Yanamala Nagarjuna Yadav is in the custody of the Kuppam police

Follow us on

Ycp leaders arrest : యనమల నాగార్జున యాదవ్.. గత కొద్ది రోజులుగా వైసీపీ అనుకూల మీడియాలో తరచూ కనిపిస్తున్న వ్యక్తి. పైగా వైసిపి అధికార ప్రతినిధి అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. వైసిపి ప్రభుత్వం ఆయనకు ఓ కార్పొరేషన్ పదవి కూడా అప్పగించింది. అయితే ఇటీవల నాగార్జున యాదవ్ దూకుడు అధికమైంది. ఎన్నికలకు ముందు, తరువాత వైసిపి అనుకూల మీడియాలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి పై సైతం హాట్ కామెంట్స్ చేశారు. ఈ తరుణంలోనే ఏపీ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కానీ పోలీసులు ధృవీకరించలేదు. అయితే ఆయనపై ఏకంగా కుప్పం పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

* స్థాయికి మించి కామెంట్స్
నాగార్జున యాదవ్ ది చిన్న వయసే.కానీ ఆయన మాటలు పెద్దవిగా ఉంటాయి. చంద్రబాబుపై బండ బూతులతో విరుచుకుపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్క చంద్రబాబునే కాదు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సైతం విమర్శలు చేశారు. మూడు పెళ్లిళ్లు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వ్యక్తిగత జీవితంపై కూడా మాట్లాడారు. వీటన్నింటిపై పోలీసులకు టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు నమోదయినా.. ఇంతవరకు నాగార్జున యాదవ్ను అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో ఆ కేసుల్లో కదలిక వచ్చింది. ఇటీవల కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబుతో పాటు పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో అలిపిరిలో వెంకటేశ్వర స్వామి ప్రాణాలతో విడిచి పెట్టారని.. ఇక ఆ పరిస్థితి ఉండదని కూడా వ్యాఖ్యానించారు నాగార్జున యాదవ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని జొమాటో ఎంప్లాయ్ తో పోల్చారు. అక్కడ సైతం కాంగ్రెస్ పార్టీ నేతలు నాగార్జున యాదవ్ పై ఫిర్యాదు చేశారు.

* పోలీసుల అదుపులో..
అయితే ఎన్నికల తరువాత ఉద్దేశపూర్వకంగానే నాగార్జున్ యాదవ్ కామెంట్స్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తద్వారా నాయకుడిగా ఎదుగుతానని.. సెలబ్రిటీ అవుతానని ఊహించి ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇటీవల ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు నుంచి విజయవాడ వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గన్నవరం విమానాశ్రయంలో కాపు కాచి అరెస్టు చేశారు. నేరుగా అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

* జగన్ కు వీర విధేయుడు
నాగార్జున యాదవ్ జగన్ కు వీర విధేయుడు. జగన్ పై ఎవరు విమర్శలు చేసినా విడిచి పెట్టేవాడు కాదు. ఆయనపై ఈగ వాలినా తట్టుకోలేనంతగా స్పందించేవాడు. గుంటూరు జిల్లాకు చెందిన నాగార్జున యాదవ్ అనతి కాలంలోనే వైసీపీలో ఎదిగారు. పీహెచ్డీ పూర్తి చేసిన ఆయన ఏ అంశంపై అయినా అనర్గళంగా మాట్లాడగలరు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. యూట్యూబ్ ఛానల్ లో తరచూ ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. వైసిపి అధికార ప్రతినిధి హోదాలో సాక్షి మీడియాలో తరచూ మాట్లాడుతుంటారు. డిబేట్లో పాల్గొంటారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. అందుకే బలమైన కేసులు నమోదు చేయాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం ఆయన తరుపు న్యాయవాది హైకోర్టులో ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే కూటమి అధికారంలోకి వచ్చిన 45 రోజుల తర్వాత.. నాగార్జున యాదవ్ పై కేసులు బిగిసుకోవడం విశేషం.