Sakey Sailajanath : ఏపీ కాంగ్రెస్ మాజీ చీఫ్ సాకే శైలజానాథ్( sailaja Nath) వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. గత కొద్దిరోజులుగా శైలజానాథ్ వైసీపీలో చేరుతారని ప్రచారం నడిచింది. అందుకు తగ్గట్టుగానే ఈరోజు ఆయన వైసీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ విధానాలు నచ్చి పార్టీలో చేరానని.. కూటమి ప్రభుత్వంపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని చెప్పుకొచ్చారు. త్వరలో ముఖ్యమైన నేతలు వైసీపీలో చేరుతారని పేర్కొన్నారు. కొద్ది నెలల కిందట శైలజానాథ్ కర్నూలులో ఓ ఫంక్షన్ లో జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అప్పటినుంచి శైలజానాథ్ వైసీపీలో చేరుతారని టాక్ ప్రారంభమైంది. ఎట్టకేలకు ఆయన వైసిపి గూటికి చేరారు.
* రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా
సాకే శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీలో( Congress Party) సీనియర్ నేతగా కొనసాగుతూ వచ్చారు. 2004లో తొలిసారిగా సింగనమల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో సైతం శైలజానాథ్ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లోకి తీసుకున్నారు. తరువాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా శైలజానాధ్ మంత్రిగా కొనసాగారు. రాష్ట్ర విభజన తర్వాత చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు బయటకు వెళ్లిపోయారు. కానీ శైలజా నాథ్ మాత్రం అదే పార్టీలో కొనసాగారు. దీంతో హై కమాండ్ అతన్ని పిసిసి చీఫ్ గా చేసింది.
* షర్మిల తీరు నచ్చక..
షర్మిల ( Sharmila)కాంగ్రెస్ చీఫ్ గా రావడాన్ని శైలజానాథ్ ఆహ్వానించారు. ఆమె నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని ఆశించారు. అయితే ఆమె ఒంటెద్దు పోకడలతో ముందుకు సాగుతుండడంతో శైలజానాథ్ పునరాలోచనలో పడ్డారు. మరోవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతూ వస్తోంది. ఏ మాత్రం బలం పుంజుకోవడం లేదు. దీంతో శైలజానాథ్ లాంటి నేతల్లో ఒక రకమైన మార్పు ప్రారంభం అయ్యింది. అందుకే జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఆయన వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సాకే శైలజానాథ్ ప్రకటించారు. ఏపీలో కూటమి పతనం ప్రారంభం అయ్యిందని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారని గుర్తు చేశారు శైలజనాథ్.
* కీలక పదవి ఆఫర్
శైలజనాథ్( sailaja Nath )సీనియర్ నేత కావడంతో ఆయన సేవలను వినియోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అనంతపురం జిల్లాలో శైలజా నాథ్ కు ప్రత్యేక అనుచర గణం ఉంది. వారు సైతం పెద్ద ఎత్తున వైసీపీలో చేరారు. ఇంకోవైపు చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్లు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు శైలజనాథ్ చెబుతున్నారు. ఈ జాబితాలో మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, మాజీ ఎంపీ హర్ష కుమార్ ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.