Jagan: ఇండియా కూటమిలో వైసీపీ చేరనుందా? ఇప్పుడు ఆ పార్టీకి అది తప్పనిసరా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో చేరడానికి మాత్రం వైసిపి వెనుకడుగు వేస్తోంది. అదే ఇండియా కూటమికి వేరే వారు నేతృత్వం వహిస్తే తప్పకుండా వైసీపీ మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ తో విభేదించి వైసిపి ఏర్పాటయింది. కాంగ్రెస్ అధినాయకత్వంతో విభేదించి పార్టీని ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ తన నాయకత్వాన్ని అంగీకరించలేదని చెప్పి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు జగన్. పార్టీ ఏర్పాటు చేసి అదే కాంగ్రెస్ పార్టీని ఘోరంగా దెబ్బతీశారు. దీంతో ఆ రెండు పార్టీలు పరస్పరం విభేదించుకుంటున్నాయి. అందుకే ఆ రెండు పార్టీల కలయికకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఇప్పుడు జాతీయ నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైసీపీని కలుపుకొని వెళ్లక తప్పదు. అదే సమయంలో కాంగ్రెస్ సైతం జాతీయస్థాయిలో ఏదో ఒక కూటమిలో చేరక తప్పదు.
* రకరకాల ప్రచారం
వైసీపీ ఓటమి నుంచి రకరకాల ప్రచారం నడిచింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి జగన్ దగ్గర అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు మాత్రం జగన్ సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు మాత్రం కాస్త ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఏపీలో తన సోదరి షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎందుకు అడ్డంకులు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఏపీలో కాంగ్రెస్ తో పాటు వామపక్షాలతో కలవడం జగన్ కు అనివార్యం.
* మమత సపరేట్ కూటమి
అయితే ఇండియా కూటమి నాయకత్వంలో సైతం మార్పులు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కూటమి నాయకత్వం అప్పగించాలన్న డిమాండ్ బలపడుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సైతం బలహీనం అవుతోంది. ఎన్నికల్లో సరైన ఫలితాలు దక్కడం లేదు ఆ పార్టీకి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా కూటమిలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ బలంగా ఉంది. మమతా బెనర్జీ నాయకత్వంలో ఇండియా కూటమి విస్తరించే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోయినా కలిసి వచ్చిన పార్టీలతో మమతా బెనర్జీ కూటమి కట్టే ఛాన్స్ కనిపిస్తోంది. అదే జరిగితే ఆ కూటమిలో జగన్ చేరడం ఖాయమని విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.