Sajjala Ramakrishna Reddy: సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి దక్కలేదు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగింది ఆ పార్టీ. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న వారు గుడ్ బై చెబుతున్నారు. సీనియర్లు సైలెంట్ అయ్యారు. జూనియర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ తరుణంలో పార్టీ ప్రక్షాళనకు నడుంబిగించారు జగన్. చాలా నియోజకవర్గాల్లో చేర్పులు మార్పులు చేశారు. పార్టీని వీడుతున్న వారి స్థానంలో కొత్తవారిని నియమించారు. ఎన్నికలకు ముందు రకరకాల ప్రయోగాలు చేశారు జగన్. దాదాపు 80 చోట్ల అభ్యర్థులను మార్చారు. ఈ ప్రయోగం వికటించడంతో తిరిగి నేతలను యధా స్థానాలకు పంపిస్తున్నారు. ఇప్పటికే మంగళగిరి, చిలకలూరిపేట తో సహా పలు నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జిలను నియమించారు. రీజనల్ కోఆర్డినేటర్లను సైతం మార్చారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎంపీలు మిధున్ రెడ్డి, వై వి సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, విజయసాయిరెడ్డి వంటి సీనియర్ నేతలకు రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. గతంలో వీరంతా రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్నా.. వాళ్లు పర్యవేక్షించిన రీజియన్లు మారాయి. అయితే అంతమందికి పదవులు ఇచ్చినా.. సజ్జల రామకృష్ణారెడ్డికి ఎటువంటి పదవి ఇవ్వకపోవడంతో అంతా చర్చ నడిచింది. ఆయనను పక్కన పెట్టినట్లు టాక్ నడిచింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయానికి సజ్జల తీరే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి.ఈ క్రమంలోనే ఆయనను పక్కన పెట్టినట్లు ప్రచారం నడిచింది.
* అంచనాలకు భిన్నంగా
అయితే అందరి ఊహలకు విరుద్ధంగా సజ్జలకు కీలక పదవి ఇచ్చారు జగన్. రాష్ట్రస్థాయి కోఆర్డినేటర్ గా నియమించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జలకు ఒక్కసారిగా పదోన్నతి కల్పించారు. ఇకనుంచి రాష్ట్రవ్యాప్తంగా వైసీపీని సమన్వయం చేసుకునే బాధ్యతను ఆయనకు కట్టబెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే అధినేత తరువాత ఇక అంత సజ్జలే. ఈ మేరకు వైసిపి కేంద్ర కార్యాలయం కూడా ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. అధినేత జగన్ ఆదేశాల మేరకు సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియమించినట్లు వెల్లడించింది.
* పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత
రాష్ట్రస్థాయిలో పార్టీ శ్రేణుల్లో సజ్జలపై ఒక రకమైన వ్యతిరేకత ఉంది. పార్టీలోని సీనియర్లు సైతం విభేదిస్తున్నారు. అయినా సరే సజ్జల మీద నమ్మకం ఉంచారు జగన్. రాష్ట్రస్థాయి కోఆర్డినేటర్ పదవిని అప్పగించారు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ అవుతోంది. ఆయన నియామకం పై మిశ్రమ స్పందన వస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి తన వెంట ఉండడం, అత్యంత నమ్మకస్తుడు కావడం వల్లే సజ్జలకు రాష్ట్ర కోఆర్డినేటర్ పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే పక్కన పెట్టారనుకున్న సజ్జల.. ఇప్పుడు పార్టీలో ఏకంగా నెంబర్ 2 స్థానాన్ని ఆక్రమించడం విశేషం.