Jagan: జగన్ చెప్పినా వినలేదు.. అందుకే ఓడిపోయాం.. వైసిపి నేతల ఆవేదన

పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశామని వైసిపి నేతలు చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమను గెలిపిస్తారని ఆశించారు. కానీ అభివృద్ధి విషయం మరిచిపోయారు. ప్రధానంగా రహదారుల నిర్మాణం లేకపోవడం ప్రజాగ్రహానికి కారణమైంది. ప్రతిరోజు రాకపోకలు సాగించే ప్రధాన రహదారులు గోతులమయంగా మారాయి.

Written By: Dharma, Updated On : July 7, 2024 1:07 pm

Jagan

Follow us on

Jagan: విశాఖపట్నం:వైసీపీ నేతల స్వరం మారుతోంది. నిన్నటి వరకు ఓటమికి కుంటి సాకులు వెతికిన వారు.. ఇప్పుడు వాస్తవాలను గుర్తిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా జరిగిన తప్పిదాలను ఒప్పుకుంటున్నారు. ఐదేళ్ల వైసిపి పాలనలో తప్పులు జరిగాయని కూడా చెప్పుకొస్తున్నారు. విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అయితే తన మనసులో ఉన్న మాటను బయట పెట్టేశారు. అసెంబ్లీ లోపల.. ఇంటా బయట అధినేత జగన్ పై ప్రశంసల జల్లు కురిపించడంలో ముందుండేవారు ధర్మశ్రీ. అటువంటి వ్యక్తి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. జగన్ వెనక పోవడం వల్లే ఓడిపోయామంటూ నిష్టూర మాడారు. ప్రస్తుతం కరణం ధర్మశ్రీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

* తప్పిన అంచనా..
పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశామని వైసిపి నేతలు చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమను గెలిపిస్తారని ఆశించారు. కానీ అభివృద్ధి విషయం మరిచిపోయారు. ప్రధానంగా రహదారుల నిర్మాణం లేకపోవడం ప్రజాగ్రహానికి కారణమైంది. ప్రతిరోజు రాకపోకలు సాగించే ప్రధాన రహదారులు గోతులమయంగా మారాయి. కనీసం రాకపోకలు సాగించడానికి వీలు లేని స్థితిలోకి చేరుకున్నాయి. అయినా సరే అభివృద్ధి కంటే సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వైసీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రజలు అభివృద్ధి లేకపోవడంతో వైసీపీని తిరస్కరించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలని గుర్తుచేస్తూ ఓడించారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఓటమికి గల కారణాలు గుర్తించలేకపోయారు. ప్రజలు పథకాలు తీసుకుని ఓటు వేయలేదని మాత్రం ఆక్షేపించారు. అయితే ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు దాటుతుండడంతో అసలు విషయాన్ని గుర్తించగలుగుతున్నారు.

* కరణం ధర్మశ్రీ హాట్ కామెంట్స్..
గత వైసిపి ప్రభుత్వంలో విప్ గా వ్యవహరించిన కరణం ధర్మశ్రీ తాజాగా మీడియా ఎదుట అనుచిత వ్యాఖ్యలు చేశారు.’ ఎన్నికలకు ముందు జగన్ కు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. ఫలితంగానే భారీ ఓట్ల తేడాతో దారుణంగా ఓడిపోయాం. సొంత నిధులు రెండు కోట్లు రోడ్లు అభివృద్ధికి ఖర్చు చేశా. కూటమి ప్రభుత్వం ఆ డబ్బులు ఇస్తుందో లేదో తెలియదు’ అని ధర్మ శ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. తెలిసో తెలియకో చాలా తప్పులు జరిగిపోయాయి అని కూడా వాపోయారు ఆయన. అయితే ఒక్క ధర్మశ్రీయే కాదు.. చాలామంది వైసీపీ నేతలు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో సరిదిద్దుకోలేని తప్పులు జరిగాయని ఇప్పుడు తప్పు పడుతున్నారు. అధినేత జగన్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ నేతల వ్యవహార శైలి మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉంది. అధినేత జగన్ వైఖరిపై నేతలు బాహాటంగానే విమర్శల డోసు పెంచే ఛాన్స్ కనిపిస్తోంది.