New Ration Cards: తెలుగు రాష్ట్రాల్లో పేదలకు రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ మొదలైంది. తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. అర్హులు ఖరారు చేసేందుకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుచేసింది. ఇటీవలే ఈ సంఘం తొలి సమావేశం జరిగింది. ఇందులో అర్హులు ఎవరనేది ఖరారుచేశారు. ఆదాయ పరిమితి నిర్ణయించారు. ఇక మరో సమావేశంలో విధి విధానాలు ఖరారు చేయాలని నిర్ణయించారు. ఇక ఏపీలో రెండు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కూడా కొత్త రేషన్‌కార్డుల జారీపై దృష్టిపెట్టింది. గతంలో అమలు చేసిన చంద్రన్న కానుకలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. రేషన్ కార్డుల రంగుతోపాటుగా జారీ మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాత రేషన్‌కార్డుల స్థానంలో కొత్త కార్డులివ్వాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు నెలలుగా వినియోగంలో లేని రేషన్ కార్డులను తొలిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే అధికారికంగా మార్గదర్శకాలు జారీ కానున్నాయి.
వారి ఫొటోలు తొలగించాలని..
ఏపీలోనూ కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన కసరత్తును ఎన్డీఏ ప్రభుత్వం మొదలు పెట్టింది. గత ప్రభుత్వం జారీ చేసిన కార్డులపైన అప్పటి సీఎం జగన్, ఆయన తండ్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఫొటోలు ముద్రించింది. అవి కనిపించకుండా చేసేందుకు కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది చంద్రబాబు ప్రభుత్వం. దీనికి సంబంధించిన డిజైన్లు పరిశీలనలో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్‌కార్డులు ఉన్నా.. వీటిలో 90 లక్షల రేషన్‌కార్డులు మాత్రమే బీపీఎల్ కింద ఉన్నట్లు కేంద్రం గుర్తించింది.. వాటికి మాత్రమే ఆహార భద్రత చట్టం కింద రాయితీ ఇస్తోంది. మిగిలిన 58 లక్షలకు పైగా కార్డులపై సబ్సిడీల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది.
విధి విధానాలు ఇలా..
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో 1.46 కోట్ల రేషన్ కార్డులు ఉండగా, గడిచిన ఐదేళ్లలో వాటి సంఖ్య 1.48 కోట్లకు పెరిగింది. ఐదేళ్లలో కొత్తగా ఇచ్చిన కార్డులు కేవలం 1.10 లక్షలే. కొత్త కార్డుల కోసం వచ్చిన దాదాపు 78 వేల దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టేసింది. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం మొత్తం 3.36 లక్షల దరఖాస్తులు దాదాపు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పెండింగ్ దరఖాస్తులతోపాటు కొత్తగా పెళ్లయిన దంపతులకు, అన్ని అర్హతలూ ఉన్న కుటుంబాలకు కొత్త కార్డులను మంజూరు చేసే అంశంపై కొత్త ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేస్తోంది.
వారి కార్డులు కట్..
ప్రభుత్వం 90 లక్షల కార్డుదారులు ఆరు నెలలుగా రేషన్ సరుకులు తీసుకోవడం లేదని ప్రభుత్వం గుర్తించింది. వాటిని తొలగించి కొత్తగా అర్హులకు కార్డులు జారీ చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.90 కోట్ల వరకు ఆదా అవుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. రాష్ట్రంలో 90 శాతం కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వంపై అధిక భారం పడుతోంది. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవడాన్ని నిలుపుదల చేస్తే వాటికి డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నారు. లేదంటే.. మళ్లీ తెల్ల కార్డులు, గులాబీ కార్డులను అమల్లోకి తెచ్చినా దాదాపు సగం భారం తగ్గుతుందనే ప్రతిపాదనలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More