China schools : గాల్వాన్ లోయలో మన సైనికులపై విరుచుకుపడుతుంది. అరుణాచల్ ప్రదేశ్ ను ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. మన దాయాది దేశం పాకిస్తాన్ కు సహాయం చేస్తుంది. చికెన్ నెక్ రోడ్డు నిర్మించి మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఐక్యరాజ్యసమితిలో మనకు వ్యతిరేకంగా స్వరం వినిపిస్తుంది. బ్రహ్మపుత్ర నదిపై ప్రాజెక్టులు కడుతుంది.. ఇలా చెప్పుకుంటూ పోవాలే గాని మనపై చైనా సాగిస్తున్న దురాఘతాలకు అంతూ పొంతూ ఉండదు. ఇవేనా.. ప్రపంచానికి కరోనా వైరస్ ను అంటించింది.. దేశం మొత్తాన్ని మూడేళ్ల పాటు లాక్ డౌన్ చేసింది.. ఆ కమ్యూనిస్టు దేశమే.. అలాంటి చైనా తన ప్రయోజనాల కోసం ఏదైనా చేస్తుంది. ఎంతకైనా తెగిస్తుంది. పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ లో ఏకంగా మెడల్స్ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. అంతేకాదు నాణ్యమైన విద్యను అందించడంలో మొదటి స్థానంలో నిలుస్తోంది. కుట్రలకు, కుయుక్తులకు, కపట బుద్ధులకు చైనా పెట్టింది పేరు. అయినప్పటికీ విద్యా విధానంలో చైనా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది అంటే అతిశయోక్తి కాదు.
సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం..
సాధారణంగా చైనా దేశంలో జరుగుతున్న ఏ విషయాలు కూడా బయటికి రావు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వ మీడియా తప్ప, ఇంకొక మీడియా ఉండదు. పైగా దేశంలో జరుగుతున్న సానుకూల పరిణామాలను మాత్రమే చైనా మీడియా బయటపెడుతుంది. టిబెట్ ఆక్రమణ, ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం, ఇతర దురాఘతాలను ఏమాత్రం బయటి ప్రపంచానికి చూపించదు. అయితే అలాంటి చైనా మీడియా ఇటీవల కొన్ని ఫోటోలను బయటికి విడుదల చేసింది. ఆ ఫోటోలు చూస్తుంటే మై హోమ్ గేటెడ్ కమ్యూనిటీస్ లాగా, అపర్ణ భవనాలు లాగా, రాజ పుష్ప ప్లాట్ల లాగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి అవి రియల్ ఎస్టేట్ వెంచర్లు కావు.. శ్రీమంతులు ఉండే భవనాలు అంతకన్నా కావు. అవి చైనాలో ప్రభుత్వ పాఠశాలలు. చైనాలో 9 ఏళ్లపాటు నిర్బంధ నాణ్యమైన ఉచిత విద్య అమల్లో ఉంది. ప్రజలు ప్రాథమిక విద్య మీద రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అక్కడి ప్రభుత్వమే అన్ని చూసుకుంటుంది. ఇక పాఠశాలల్లో అఖ్యాధునిక సదుపాయాలు ఉంటాయి. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాలతో అనుసంధానం చేస్తారు. విద్యార్థుల్లో పరిశోధన, ఇతర నైపుణ్యాలు అభివృద్ధి చేస్తారు. చైనా ప్రభుత్వం కేవలం విద్యాశాఖకు ప్రతిఏటా 850 బిలియన్ డాలర్లు కేటాయిస్తుంది. ఇది అమెరికా రక్షణ శాఖ బడ్జెట్ కు సమానం.. చదువు మీద మాత్రమే కాకుండా క్రీడల పై కూడా చైనా ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. పాఠశాల స్థాయి నుంచి వారికి ఇండోర్, ఔట్ డోర్ గేమ్స్ లో శిక్షణ ఇస్తుంది.
విద్యార్థులకు ఆస్థాయిలో శిక్షణ ఇస్తుంది కాబట్టే.. ప్రపంచ స్థాయి క్రీడా పోటీల్లో చైనా క్రీడాకారులు మెడల్స్ సాధిస్తుంటారు. ఇటీవల నిర్వహించిన పారిస్ ఒలింపిక్స్ లో పసిడి పతకాలను చైనా క్రీడాకారులు ఒడిసి పట్టారు. అమెరికాకు గట్టి పోటీ ఇచ్చారు. స్విమ్మింగ్ నుంచి మొదలు పెడితే టేబుల్ టెన్నిస్ వరకు.. ప్రతి క్రీడా విభాగంలోనూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఇదంతా చదివితే బిజెపి వాళ్లకు కోపం రావచ్చు.. కమ్యూనిస్టు నాయకులకు గర్వం ఉప్పొంగ వచ్చు. కానీ.. ఒక దేశంలో సానుకూల దృక్పథాలు కనిపిస్తే కచ్చితంగా వాటిని అమలు చేయాలి. వాటిని అనుసరించి దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలి. అప్పుడే ఒక సమాజం గొప్పగా విలసిల్లుతుంది. చైనా దేశంలో ఎన్నో దారుణాలు జరుగుతుండొచ్చు, మరెన్నో దురాఘతాలు వెలుగు చూస్తుండొచ్చు. అవన్నీ పక్కనపెట్టి.. మిగతా విషయాలను పరిగణలోకి తీసుకొని, ఆచరణలో పెడితే భారత్ కు తిరుగు ఉండదు. కానీ, ఆ దిశగా మన దేశ పాలకులు అడుగులు వేస్తారా అంటే.. కాస్త ఆలోచించాల్సిందే..
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More