Sajjala Ramakrishna Reddy: వైసీపీలో సజ్జల ఒంటరయ్యారా? కావాలనే అలా చేశారా?

గత ఐదేళ్లుగా పార్టీతో పాటు ప్రభుత్వంలో సజ్జల పాత్ర అంతా ఇంతా కాదు. అటువంటిది వైసిపి అధికారానికి దూరం కావడంతో కష్టాలు వెంటాడుతున్నాయి సజ్జలకు. కేసులు నమోదవుతున్నాయి. విచారణలు కొనసాగుతున్నాయి.

Written By: Dharma, Updated On : October 19, 2024 10:19 am

Sajjala Ramakrishna Reddy

Follow us on

Sajjala Ramakrishna Reddy: వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి ఒంటరి అయ్యారా? ఆయనకు నేతల వెన్నుదన్ను లేకుండా పోయిందా? అధినేత జగన్ సైతం పక్కన పెట్టారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. గత ఐదేళ్లుగా పార్టీతో పాటు ప్రభుత్వంలో నెంబర్ 2 గా ఎదిగారు సజ్జల.అంతకుముందున్న విజయసాయిరెడ్డి, వై వి సుబ్బారెడ్డి కి కాదని కూడా సజ్జలకే జగన్ ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డికి పార్టీలో కీలకమైన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. వైసిపి అధికారానికి దూరమైంది. దారుణ పరాజయం చవిచూసింది. ఇంతటి ఓటమికి సజ్జల ఇచ్చిన సలహాలే కారణమని ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. నేరుగా వైసిపి నేతలు సజ్జలపై ఆరోపణలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటు సజ్జల సైతం ఓటమి తర్వాత జగన్ నిర్వహించిన సమీక్షలకు చురుగ్గా హాజరు కాలేదు. సజ్జల కుమారుడు భార్గవరెడ్డిని సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బాధ్యతలను కూడా తొలగించారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు సజ్జల మాట చెల్లుబాటు అయింది. ఇప్పుడు మాత్రం ఓటమికి ఆయనే కారణమన్నట్టు పార్టీ శ్రేణులు వ్యవహరిస్తున్నాయి. దీంతో సజ్జల పార్టీలో ఒంటరివాడు అయ్యాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

* టిడిపి కార్యాలయం పై దాడి కేసు
తాజాగా సజ్జల మెడకు టిడిపి కేంద్ర కార్యాలయం దాడి కేసు చుట్టుకుంది.ఆయనకు మంగళగిరి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు.విచారణకు హాజరుకావాలని సూచించారు.ఆయన మంగళగిరి వచ్చి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. అయితే ఒకప్పుడు సజ్జల అడుగుపెడితే పార్టీలో కీలక నేతలంతా ఆయన వెంట ఉండేవారు. ఇప్పుడు మాత్రం న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఒకరిద్దరు నాయకులు మాత్రమే కనిపించారు. కనీసం సజ్జలకు మద్దతుగా ఒక్క నేత కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. దీంతో సజ్జలను ఉద్దేశపూర్వకంగా పార్టీలో సైడ్ చేస్తున్నారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.సజ్జలకు ఇంత కష్టం ఎదురైతే.. పార్టీ నేతలు స్పందించకపోవడం ఏమిటని ఆయన అనుచరులు బాధపడుతున్నారు.

* అంతా వ్యూహాత్మకంగానే
సజ్జలను వ్యూహాత్మకంగా పార్టీలో అనధికార ఒంటరి చేశారన్నది ఒక విమర్శ. జగన్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ల నియామకం చేపట్టారు. కానీ సజ్జలకు మాత్రం ఒక్క రీజియన్ కూడా అప్పగించలేదు. కనీసం పార్టీలో కూడా ప్రాధాన్యత తగ్గించేశారు. వాటిని పై నిర్వహిస్తున్న సమీక్షల్లో ఏదో ఒక మూలన కనిపిస్తున్నారు సజ్జల. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సజ్జలను టార్గెట్ చేసుకుంది. వైసిపి నేతలపై నమోదవుతున్న ప్రతి కేసులో సజ్జల పాత్రను బయటపెడుతోంది. ఆయనను ఇరకాటంలో పెడుతోంది. దీంతో సజ్జల ఒక రకమైన బాధతో గడుపుతున్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడితే అటు అధినేతతో పాటు సీనియర్లు సైతం తనకు అండగా నిలవకపోవడంపై ఆవేదనతో ఉన్నారు. ఒంటరినయ్యానని బాధపడుతున్నారు.