CM Chandhrababu :  *బాబు సూపర్ సిక్స్ హామీల అమలు కష్టసాధ్యమేనా? నెక్ట్స్ ఏంటి మరీ?*

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటుతోంది. ఒక్క పింఛన్ పథకం మాత్రమే పట్టాలెక్కింది. సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా కీలక హామీలకు ఇప్పటికీ మోక్షం లేదు. ఇదే సమయంలో చంద్రబాబు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒక రకమైన అనుమానం ప్రారంభం అయ్యింది.

Written By: Dharma, Updated On : July 30, 2024 11:00 am
Follow us on

CM Chandhrababu : చంద్రబాబు భయపడుతున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చుతానో లేదోనని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెబుతున్నారు. వైసీపీ సర్కార్ 10 లక్షల కోట్లు అప్పు చేసిందని.. ఈ సమయంలో సూపర్ సిక్స్ పథకాలంటే భయం వేస్తోందని వ్యాఖ్యానించారు. ఎటూ ముందుకు కదల లేక పోతున్నామని.. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజానీకం ఆలోచించుకోవాలని కోరుతున్నారు. దీంతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తారా? లేదా? అన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఒక సీనియర్ గా, అనుభవజ్ఞుడుగా చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? అటువంటప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారు? ఉచిత పథకాలపై ఎందుకు ప్రచారం చేశారు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో రెట్టింపు సంక్షేమ పథకాలను అమలు చేస్తానని.. సంపద సృష్టిస్తానని.. ఆదాయాన్ని పెంచుతానని.. పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ల కోసం ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఏడాదికి ఒక కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని.. 18 ఏళ్లు గడిచిన మహిళలకు మహాలక్ష్మిపథకం కింద 1500 రూపాయల చొప్పున నెలకు అందిస్తానని.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తానని.. ఇలా ప్రజాకర్షక పథకాలను చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ నవరత్నాలు మాదిరిగా.. సూపర్ సిక్స్ అంటూ హడావిడి చేశారు. ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తే.. సంపద సృష్టిస్తానని బదులిచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటుతున్నా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి పట్టించుకోవడం లేదు. పైగా గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసిందని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సంక్షేమ పథకాల అమలు కష్టమని కొత్త పల్లవి అందుకున్నారు.

* సంక్షేమానికి వ్యతిరేకి
సంక్షేమం విషయంలో చంద్రబాబు వ్యతిరేకి అన్న ముద్ర ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రకటించినప్పుడు చంద్రబాబు ఎద్దేవా చేశారు. కానీ రాజశేఖర్ రెడ్డి చేసి చూపించారు. రుణమాఫీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలు చేశారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అదే కాంగ్రెస్ పార్టీకి పునాదిగా మారింది. రెండుసార్లు అధికారాన్ని తెచ్చి పెట్టింది. అయితే రాష్ట్ర విభజనతో ప్రత్యేక పరిస్థితుల్లో చంద్రబాబు సీనియార్టీని కోరుకున్నారు నవ్యాంధ్ర ప్రజలు. 2014 ఎన్నికల్లో సైతం చంద్రబాబు చాలా రకాల హామీలు ఇచ్చారు. కానీ అమలు చేయలేకపోయారు. అందుకే 2019 ఎన్నికల్లో ఓడిపోయారు.

* జగన్ చేసి చూపించారు
గత ఐదేళ్లలో అభివృద్ధి మాట అటుంచితే.. జగన్ సంక్షేమాన్ని చేసి చూపించారు. రాజకీయాలకు అతీతంగా పథకాలను అమలు చేయగలిగారు. అయితే రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని.. 20 సంవత్సరాలు పాటు వెనక్కి నెట్టారని.. అప్పులు చేశారని రకరకాల ఆరోపణలు చేశారు చంద్రబాబు. తాను వస్తే సంక్షేమ పథకాలను కొనసాగించడంతో పాటు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అప్పులు చేయనని.. సంపద సృష్టించి ప్రజలకు పంచుతానని చెప్పుకొచ్చారు. సీనియర్ నేత కావడంతో ప్రజలు కూడా నమ్మారు. కానీ ఇప్పుడు చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

* ఆ మీడియా కథనాలతో..
చంద్రబాబుకు ఒక అలవాటు ఉంది. చంద్రబాబు ఆలోచనలకు తగ్గట్టు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా నడుచుకుంటుంది. అందులో వచ్చిన కథనాలు చంద్రబాబు ఆలోచనలకు దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు అదే మీడియాలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు కూడా ప్రజలు ఆలోచించుకోవాలని కోరుతున్నారు. దీంతో సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చుతారా? లేదా? అన్నది చర్చకు దారితీస్తోంది. జాతీయ మీడియా సైతం దీనిపైనే అనుమానంతో ఉంది.