Jharkhand Train Accident: జార్ఖండ్: దేశంలో మరో రైలు ప్రమాదం జరిగింది. జార్ఖండ్‌లో హౌరా – సీఎస్‌ఎంటీ రైలు పట్టాలు తప్పింది. మంగళవారం(జూలై 30న) తెల్లవారుజామున 3:45 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో18 బోగీలు పట్టాలు తప్పగా మూడు బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా 60 మంది ప్రయాణికులు గాయపడుతున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్ డివిజన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే, సివిల్ పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అప్పటికే పట్టాలు తప్పిన గూడ్స్ రైలు వ్యాగన్‌లను ఢీకొట్టడం ద్వారా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హౌరా నుంచి ముంబై వెళ్తున్న రైలు సోమవారం రాత్రి 11:02 గంటలకు టాటానగర్‌కు చేరుకోవాల్సి ఉంది. కానీ, చాలా ఆలస్యంగా రాత్రి 2:37 గంటలకు చేరుకుంది. 2 నిమిషాల ఆగిన తర్వాత తదుపరి స్టేషన్ చక్రధర్‌పూర్‌కి బయలుదేరింది. అయితే స్టేషన్‌కు చేరుకోక ముందే ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ప్రమాద స్థలికి చేరుకుని ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితికూడా నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. బిహార్‌లోనూ పెద్ద రైలు ప్రమాదం తప్పింది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు భారీ ముప్పు తప్పింది. సమస్తిపూర్‌లో ఈ రైలు ఇంజిన్, రెండు బోగీల నుంచి ఇతర బోగీలు విడిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఘటనపై నిపుణుల బృందం దర్యాఫ్తు చేపట్టింది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు దర్బంగ నుంచి న్యూఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఏడాది జరిగిన రైలు ప్రమాదాలు..
మన దేశంలో ఎక్కువ మంది ప్రయాణించేది రైళ్లలోనే. బస్సు, ఫ్లైట్ టికెట్‌తో పోలిస్తే రైలు టికెట్ ధరలు తక్కువ. వేగం ఎక్కువ. సుఖవంంతంగా ప్రయాణం చేయవచ్చు. అయితే రైలు ప్రమాదాలు జరిగితే మాత్రం పెద్దమొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతాయి. 2023 నుంచి మన దేశంలో రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
– ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూఐడు రైళ్లు ఒకదానిపై ఒకటి పట్టాలు తప్పడంతో 300 మంది మరణించారు. 900 మంది గాయపడ్డారు. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బహనాగా బజార్ స్టేషన్‌లో గూడ్స్ రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. భారత దేశ రైల్వే చరిత్రలోనే ఇది ఘోర ప్రమాదం.
– 2023 అక్టోబర్‌లో విశాఖ–పలాస, విశాఖ–రాయగడ ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 14 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.
– బిహార్‌లోని బక్సక్ జిల్లాలో 2023 అక్టోబర్‌లో ఆనంద్ విహార్ టర్మినల్ – కామాఖ్య జంక్షన్ నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించిన ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, 70 మంది గాయపడ్డారు.
– 2023లో మధురై జంక్షన్‌లో ఉన్న లక్నో–రామేశ్వరం భారత్‌గౌవర్ రైలులో మంటలు చెలరేగాయి. 10 మంది అగ్నికి ఆహుతయ్యారు. 20 మందికిపైగా గాయపడ్డారు.
– 2023 సెప్టెంబర్‌లో మథురలోని షకుర్ బస్తీ నుంచి ఒక ఈఎంయూ రైలు పట్టాలు తప్పింది.
– పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాదంలో 15 మంది మరణించారు. 60 మంది గాయపడ్డారు. కాంచన గంగా ఎక్స్‌ప్రెస్ రైలును గూడ్సు రైలు ఢీకొనడంతో ఈప్రమాదం జరిగింది.
– 2023 డిసెంబర్‌లో రాజస్థాన్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 100 మందికిపైగా మృతిచెందారు. ఈ ఘటనలో 500 మందికిపైగా గాయపడ్డారు.