https://oktelugu.com/

YS Sharmila: షర్మిల విషయంలో అంతకు తెగించారా?

షర్మిల పాదయాత్ర కడపలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను షర్మిల ఫ్యాన్ అంటూ ఒక యువకుడు మైక్ తీసుకున్నాడు. సాక్షి స్క్రిప్ట్ యధావిధిగా చదివేశాడు.

Written By:
  • Dharma
  • , Updated On : April 9, 2024 / 12:19 PM IST

    YS Sharmila

    Follow us on

    YS Sharmila: ఇప్పుడు ఐప్యాక్ ఏపీలో అన్ని పార్టీలకు పని చేస్తోంది. మీరు చదివింది నిజమే. వైసిపి తో పాటు ప్రత్యర్థి పార్టీలకు సైతం ఐప్యాక్ సేవలందిస్తోంది. ప్రత్యర్థి పార్టీలను పలుచన చేసేందుకు ఆ టీం చేయని ప్రయత్నాలు లేవు. లోకేష్ పాదయాత్ర సమయంలో అయితే వందలాది మంది రంగంలోకి దిగారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. కనికట్టు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇవేవీ పట్టించుకోని లోకేష్ పాదయాత్రను పూర్తి చేయగలిగారు. అయితే ఇప్పుడు ఐప్యాక్ టీం షర్మిల కోసం పనిచేస్తోంది. ప్రస్తుతం కడప జిల్లాలో షర్మిల పర్యటిస్తున్నారు. అధికార పార్టీతో పాటు అన్న పై విరుచుకుపడుతున్నారు. దీంతో ఎలాగోలా షర్మిలను అడ్డుకోవాలని ఐ బ్యాక్ టీం రంగంలోకి దిగింది. పలుచన చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఎడిటింగ్ చేసిన ఆ వీడియో ఇట్టే దొరికిపోతోంది.

    షర్మిల పాదయాత్ర కడపలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను షర్మిల ఫ్యాన్ అంటూ ఒక యువకుడు మైక్ తీసుకున్నాడు. సాక్షి స్క్రిప్ట్ యధావిధిగా చదివేశాడు. 2011 నుంచి జగన్ ప్రజల కోసం పనిచేస్తున్నారని.. ఆయన చెప్పిన ప్రతి హామీని నెరవేర్చారని… జగన్ చెప్పిన దాన్ని చేసి తీరుతాడని భారీ డైలాగ్ కొట్టాడు. మీ కుటుంబ సమస్యలను తెచ్చి రాజకీయాలు చేయకండి అంటూ షర్మిలకు సలహా ఇచ్చాడు. ఆ కుర్రాడి మాట తీరు చూస్తుంటే కచ్చితంగా ప్రామిటింగ్ కనిపిస్తోంది. అయినా ఆగ్రహానికి లోను కాకుండా షర్మిల సమయస్ఫూర్తిగా వ్యవహరించారు. నేను నువ్వు అభిమానించే నేత కోసం 3200 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశానని.. అలాంటి సొంత చెల్లి బతుకుకునే రోడ్డున పడేశాడంటూ షర్మిల మాట్లాడడంతో ఆ యువకుడి నోటి మాట రాలేదు. అయితే ఐపాక్ టీం ఇక్కడే తన తెలివితేటలను ప్రదర్శించింది. ఆ యువకుడి మాటలనే హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది.

    అయితే ఐప్యాక్ టీమ్ కు ఈ తరహా ప్రయత్నాలు కొత్త కాదు. గత ఎన్నికలకు ముందు నుంచి వైసీపీతో పాటు జగన్ తరుపున ఈ టీం పని చేస్తోంది. ప్రజల్లో వర్గ విభేదాలను సృష్టించడం ఈ టీంకు అలవాటైన విద్య. ముఖ్యంగా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎటువంటి ప్రచారాన్నైనా రక్తి కట్టించగల నేర్పరి. దీనికి వైసీపీ సోషల్ మీడియా విభాగం ఎలాగూ తోడు ఉంటుంది. సజ్జల భార్గవ్ నేతృత్వంలోని ఈ టీం కూడా చక్కగా పనిచేస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీకి షర్మిల నుంచి భారీ డ్యామేజ్ జరుగుతోంది. అందుకే అటు ఐ ప్యాక్ టీం తో పాటు ఇటు సజ్జల భార్గవ్ నేతృత్వంలోని సోషల్ మీడియా టీం పూర్తిగా షర్మిలపైనే దృష్టి పెట్టింది. కానీ ఇటువంటి ప్రయత్నాలను షర్మిల లైట్ తీసుకుంటున్నారు. కనీసం పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు.