Pothina Mahesh: నిన్నటి వరకు చాలామంది జనసేన నేతలకు పవన్ దేవుడు. కానీ నేడు దెయ్యంలా కనిపిస్తున్నాడు. తమకు సీటు ఇవ్వలేదనో.. వేరే పార్టీకి తమ సీటు వెళ్ళిందనో పవన్ పై విరుచుకుపడుతున్నారు. నిన్నటి వరకు దేవుడంటూ నెత్తిన పెట్టుకున్న వారే.. అమ్మ నా బూతులు తిడుతున్నారు. చివరకు అధినేత వ్యక్తిగత జీవితంపై కూడా మాట్లాడుతున్నారు. కేవలం తమ రాజకీయ ఉన్నతికి పవన్ ఉపయోగపడలేదన్న అక్కసుతో నోటికి వచ్చిన ఆరోపణలు చేస్తున్నారు. అయితే వారి మాటలు వెనుక వైసీపీ హస్తం ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇలా ఆరోపణలు చేస్తున్న ఒక్కొక్కరు వైసీపీ గూటికి చేరుతున్నారు. తమ ముసుగును తొలగిస్తున్నారు.
జనసేనకు గౌరవ సలహాదారుడు మాదిరిగా హరి రామ జోగయ్య ఎంతలా ప్రవర్తించారో అందరికీ తెలిసిన విషయమే. 8 పదుల వయసులో ఉన్న ఆయన మంచానికి పరిమితమయ్యారు. అటువంటి వ్యక్తి రాతలు, ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియనిది కాదు. కానీ ఆయన పేరుతో లేఖలు రాశారు. జనసేన పొత్తు పెట్టుకోవడాన్ని తప్పు పట్టారు. కాపులను ఎగదోసే ప్రయత్నం చేశారు. చివరకు అదే హరి రామ జోగయ్య కుమారుడు వైసిపి పక్షానికి చేరేసరికి ప్రజలకు అసలు సినిమా అర్థమైంది. ముద్రగడ పద్మనాభం గురించి అందరికీ తెలిసిన విషయమే. గత ఎన్నికలకు ముందు, తర్వాత ఆయన వైసీపీ ప్రయోజనాల కోసమే పని చేశారు. అందులో భాగంగానే జనసేనలోకి వస్తానని తన మనసులో మాట చెప్పారు. ఆయన అసలు లక్ష్యాన్ని గమనించిన పవన్ డోర్లు మూశారు. దీంతో విధి లేని పరిస్థితుల్లో తాను అభిమానించే వైసీపీకి వెళ్లారు. పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. ఇప్పుడు ఆ వంతు పోతిన మహేష్ కు వచ్చింది.
జనసేన ఆవిర్భావం నుంచి పనిచేసిన నేతల్లో పోతిన మహేష్ ఒకరు. ఇది కాదనలేని సత్యం కూడా. జనసేన లేకుంటే ఆయనెవరో ఈ బయట ప్రపంచానికి తెలియదు. కేవలం విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వారికి ఎంతో కొంత తెలుస్తుంది. కానీ ఆయన తనకు తానుగా ఒక రాష్ట్రస్థాయి నేతగా భావించారు. తప్పకుండా టికెట్ దక్కుతుందని ఆశించారు. కానీ పొత్తులో భాగంగా సీటు బిజెపికి కేటాయించారు. జనసేన తో పాటు టిడిపికి చాన్స్ లేకుండా పోయింది. టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వంటి నేతలు సీటు ఆశించారు.జనసేన నుంచి పోతున్న మహేష్ ఉన్నారు. కానీ పొత్తులో భాగంగా బిజెపికి సీటు కేతయించడంతో వీరు ఎవరికి ఛాన్స్ లేకుండా పోయింది. కానీ వారంతా కిమ్మనకుండా ఉన్నారు. ఒక్క పోతిన మహేష్ మాత్రం బయటకు వచ్చి అసంతృప్తి వ్యక్తం చేయడమే కాదు.. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చివరకు ఆయన భార్యపై కూడా మాట్లాడారు. వైసీపీ నేతలకు మించి వ్యవహరించారు. అంటే ఈ లెక్కన ఆయన వైసీపీ భావజాలాన్ని ఎక్కించుకున్నట్లే కదా. ఒప్పందంతో మాట్లాడినట్టే కదా? అయితే ఈ తరహా నాయకులకు జనసేనలో ఉన్నంతవరకే గౌరవం. వైసీపీలోకి వెళ్లిన తర్వాత చెల్లని కాసులుగా మారిన నేతలు ఎంతోమంది ఉన్నారు. వారి ముందు పోతిన మహేష్ అనే నేత గొప్ప కాదు. ఆ విషయాన్ని ఆయన గమనించుకుంటే మంచిది. లేకుంటే వైసీపీలో నవ్వుల పాలైన నేతల జాబితాలో ఆయన ఒకరన్న విషయాన్ని గమనించుకోవాలి.