Arya Police Case: తమిళనాడు యంగ్ హీరోల్లో విభిన్నమైన సినిమాలు చేస్తూ యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు ఆర్య. ఈయన మన తెలుగు ఆడియన్స్ కి ‘వరుడు’ చిత్రం ద్వారా విలన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈయన హీరో గా నటించిన అనేక తమిళ సినిమాలు తెలుగు లో డబ్ అయ్యాయి. వాటిల్లో ‘రాజా రాణి’ అనే చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరో ఆర్య , ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో పోలీస్ కేసు నమోదైంది. సినిమా షూటింగ్ నిమిత్తం తమ సంస్థ నుండి అద్దెకు తీసుకున్న కెమెరాలు , లైటింగ్ పరికరాలకు సంబంధించి 1 కోటి 80 లక్షల రూపాయిలు హీరో ఆర్య చెల్లించాల్సి ఉందని సదరు సంస్థ యజమాని పేర్కొన్నారు.
ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా హీరో ఆర్య మోసానికి పాల్పడ్డారని , ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకి ఆర్య హీరో గా నటిస్తున్న మలయాళం చిత్రం ‘అనంతన్ కాడు ‘ మూవీ చిత్రీకరణ కోసం గత ఏడాది ఫిబ్రవరి నెలలో జూబ్లీ హిల్స్ వేంకటగిరి పరిధిలోని హైలంకాలనీకి చెందిన ‘తాహెర్ సినీ టెక్నీక్’ అనే సంస్థ నుండి షూటింగ్ కోసం కెమెరాలు , లైటింగ్ పరికరాలను అద్దెకు తీసుకున్నారు. ఈ సంస్థ తమ సొంత ఖర్చులను భరిస్తూ ఈ పరికరాలను హైదరాబాద్ నుండి కేరళకు షూటింగ్ కోసం తరలించింది. మొత్తం 2 కోట్ల 12 లక్షల రూపాయలకు గానూ , ఆర్య , ఆ చిత్ర నిర్మాత 1 కోటి 80 లక్షల రూపాయిలు బకాయిలు చెల్లించాలి. సినిమా విడుదలకు ముందే ‘నో డ్యూ సర్టిఫికేట్ ‘ తీసుకుంటామని లిఖితపూర్వకంగా ఒప్పందం చేసుకున్న తర్వాత కూడా మాట నిలబెట్టుకోలేదట.
ఈ బకాయిల చెల్లింపు కోసం అనేక సార్లు చిత్ర బృందానికి కాల్ చేసినప్పటికీ, వాట్సాప్ మెసేజీలు పెట్టినప్పటికీ వాళ్ళ వైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదట. పైగా డబ్బులు అడిగినందుకు హీరో ఆర్య, అతని బృందం బెదిరింపు చర్యలకు పాల్పడ్డారని , ఆ సంస్థకు చెందిన అకౌంటెంట్ జావీద్ తన ఫిర్యాదు లో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు ని స్వీకరించిన పోలీసులు , కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ విషయం అటు తమిళ ఇండస్ట్రీ లోనూ , ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ లోనూ హాట్ టాపిక్ గా మారింది.
