Indosol Solar Company: ఇండోసోల్ సోలార్ కంపెనీ(indosol solar company) వ్యవహారంలో ప్రభుత్వం అనవసరంగా జోక్యం చేసుకుంటుందా? ప్రకాశం జిల్లాలో బలవంతపు భూసేకరణకు దిగుతోందా? సంబంధంలేని అంశాన్ని ప్రభుత్వం తనపై వేసుకుంటుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామం వద్ద సోలార్ ప్లాంట్ నిర్మాణానికి గాను భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూ సేకరణకు గాను స్థానికుల నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతుంది. అయితే పంట పొలాలను ఇచ్చేది లేదని స్థానికులు తేల్చి చెబుతున్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. తమ అభిప్రాయం తీసుకోకుండా జీవో ఎందుకు జారీ చేశారని ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి ఇండోసోల్ సోలార్ కంపెనీ యాజమాన్యం జగన్(YS Jagan Mohan Reddy ) బినామీ అని ఆరోపణలు చేసింది టిడిపి కూటమి. ఇప్పుడు అదే కంపెనీకి భూములు ఎలా కేటాయిస్తారు అన్నది రైతుల నుంచి వినిపిస్తున్న మాట. అయితే జగన్ ప్రభుత్వ హయాంలో ఇండో సోల్ సోలార్ కంపెనీకి 8400 ఎకరాలు కేటాయిస్తూ రెండుసార్లు జీవో జారీ చేశారు. అయితే అది ఉలవపాడు మండలంలో కాదు. వేరే చోట వారికి ఇవ్వగా.. టిడిపి కూటమి ప్రభుత్వం దానిని మార్పు చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హిందుస్థాన్, భారత్ పెట్రోలియం కి సంబంధించి భారీ రెఫైనరీలు మంజూరయ్యాయి. అయితే గతంలో ఇండోసోల్ కంపెనీకి జగన్ సర్కార్ కేటాయించిన భూములే అందుకు అవసరం అయ్యాయి. దీంతో ఇండోసోల్ కంపెనీకి కేటాయించిన భూములను రిఫైనరీలకు అప్పగించారు. ఆ కంపెనీకి సర్దుబాటు చేసే క్రమంలో ఉలవపాడు మండలంలో భూములు కేటాయించాల్సి వచ్చింది.
Also Read: శ్రీశైలం గేట్లు ఎత్తివేత
పచ్చని పంట పొలాలు ధ్వంసం..
అయితే పచ్చని పంట పొలాలను ధ్వంసం చేసి కంపెనీ స్థాపిస్తే ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 8400 ఎకరాల్లో నిర్మించే ఈ ప్రాజెక్టుతో దాదాపు 14 వేల మందికి ఉపాధి దొరుకుతుందని.. ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇప్పుడు వేల కుటుంబాలు వీధిన పడాల్సి వస్తోంది. పైగా పచ్చని పంట పొలాలతో అలరారే ప్రాంతం అది. జాతీయస్థాయిలో మామిడి పంటకు ప్రసిద్ధి కూడా. అటువంటి ప్రాంతాన్ని పరిశ్రమలకు కేటాయించడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పైగా వైసీపీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన టిడిపి కూటమి ఆ దిశగా పయనించడం ఏమిటన్న అనుమానం వ్యక్తం అవుతుంది. దీని వెనుక భారీ కుంభకోణం ఉన్నట్లు అనుమానాలు కూడా ఉన్నాయి. అవి ప్రజల్లోకి వెళితే మాత్రం ప్రభుత్వానికి మైనస్ తప్పదు. ఇప్పటికే ఈ విషయంలో కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగింది.
Also Read: టీడీపీ ఎమ్మెల్యే ఫెయిల్! ఆ పార్టీ వాళ్లే నిరసన తెలిపే స్థాయికి దిగజారాడిలా..
అనువైన భూములు ఉన్నా..
మరోవైపు ప్లాంట్( plant) నిర్మాణానికి సంబంధించి ప్రకాశం జిల్లాలో చాలా ప్రాంతాలు అనువుగా ఉన్నాయి. అందునా ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. వాటిని కేటాయించకుండా పంట భూములను ఇవ్వడం ఏమిటన్న వాదన ఉంది. పైగా ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోవడం ఏమిటనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ఇందులో ప్రభుత్వ ప్రమేయం లేదని.. నేరుగా సోలార్ కంపెనీ యాజమాన్యం వచ్చి భూములు కొనుగోలు చేస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు చూస్తే యంత్రాంగం అంతా ఈ అభిప్రాయ సేకరణలో పాల్గొంటుంది. మరోవైపు ఇతర దేశాల్లో ఉండే సోలార్ పరిశ్రమలకు సంబంధించిన ప్లాంట్లకు వందల ఎకరాల్లోనే భూములు కేటాయించారు. ఇక్కడ మాత్రం వేలాది ఎకరాలు కేటాయించడం ఏమిటనేది ఒక ప్రశ్న. ఇలా అడుగడుగునా ఇండోసోల్ సోలార్ పరిశ్రమ విషయంలో వేళ్ళు అన్ని కూటమి ప్రభుత్వం వైపే చూపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకుంటుందో? లేదో? చూడాలి.