Microsoft Pakistan Exit: ప్రపంచంలో ఏ కార్పొరేట్ సంస్థ అయినా సరే.. ఒక్కసారి ఒక ప్రాంతంలో తన పనితీరు ప్రారంభించిందంటే సాధ్యమైనంతవరకు అక్కడి నుంచి బయటికి రావడానికి ఇష్టపడదు. పైగా తన వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఏవైనా అనివార్య కారణాలు ఏర్పడితే తప్ప అక్కడి నుంచి రావడానికి ఆసక్తిని చూపించదు. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీ తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ముందే అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటుంది. అక్కడి వాతావరణం.. రాజకీయం.. వనరులు.. ఉద్యోగులు.. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే కార్యాలయాన్ని ప్రారంభిస్తుంది.. జరిగే వ్యాపారం.. వచ్చే ఆదాయం.. మిగిలే లాభం ఇవన్నీ కూడా కార్పొరేట్ కంపెనీ లెక్కలు వేసుకొని మరీ ముందుగానే రంగంలోకి దిగుతుంది.
అయితే ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా కాస్త ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడిన నేపథ్యంలో కొన్ని కొన్ని కంపెనీలు వాటి అనుబంధ శాఖలను మూసివేస్తున్నాయి. అంతే తప్ప ప్రధాన కార్యాలయాన్ని మాత్రం మార్చవు. అయితే ఇటీవల పాకిస్తాన్ దేశంలో మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అంతటి ఆఫ్రికా ఖండంలో పనిచేస్తున్న మైక్రోసాఫ్ట్.. అక్కడ ఇంతవరకు తన ఒక్క శాఖను కూడా ఎత్తివేయలేదు. దీనిని బట్టి పాకిస్తాన్ దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
Also Read: మైక్రో సాఫ్ట్ పాక్ నుంచి వెళ్లిపోవడంలో ఆశ్చర్యం ఏముంది? అసలు ఇన్ని రోజులు ఉండడమే గొప్ప కదా?
పాకిస్తాన్లో కొద్ది సంవత్సరాలుగా రాజకీయంగా అస్థిరత కొనసాగుతోంది. నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల బాగోగులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా అక్కడ పన్నులు విపరీతంగా ఉన్నాయి. సౌకర్యాలు నేల చూపులు చూస్తున్నాయి. అప్రకటితమైన విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. ఇక సాగునీటి సరఫరా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. తాగునీరు కూడా అంతంతమాత్రంగానే లభిస్తోంది. వివిధ కంపెనీలకు సంబంధించి ఏవైనా వస్తువులు దిగుమతి చేసుకోవాలి అంటే అక్కడ విదేశీ మారక నిల్వలు దారుణంగా ఉన్నాయి. డాలర్లను కొనుగోలు చేయాలంటే కంపెనీలకు తలకు మించిన భారం అవుతోంది. ఇక రాజకీయ అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఏవైనా అనుమతులు రావాలంటే అధికారులను ప్రసన్నం చేసుకోవాలి. రాజకీయ నాయకుల చేతులు తడపాలి. ఇవన్నీ జరిగితేనే అక్కడ వ్యాపారాలు చేయడానికి అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో అన్ని మూసుకొని రావాల్సి ఉంటుంది.
ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీలు పాకిస్తాన్ లో తమ కార్యాలయాలను మూసివేశాయి. అంతేకాకుండా తమ శాఖలను.. స్థానికంగా ఉన్న కంపెనీలకు అమ్మివేశాయి. ఇక మైక్రోసాఫ్ట్ విషయంలో కూడా అదే జరిగింది. కొంతకాలంగా మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ దేశంలో ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్నది. చివరికి ఇంటర్నెట్ సేవలను పాకిస్తాన్ దేశం మైక్రోసాఫ్ట్ కు అందించలేకపోయింది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడి పనికిమాలిన ఫైర్ వాల్స్ వల్ల నెట్ చాలా స్లోగా ఉంటుంది. దీంతో ఐటీ కార్యకలాపాలు అంతగా సాగడం లేదు. వాస్తవానికి నేటి కాలంలో ఇంటర్నెట్ అనేది విపరీతమైన వేగంతో ఉంది. భారత్ లాంటి దేశంలో 5g సేవలు అందుబాటులోకి వచ్చి చాలా రోజులు గడిచిపోయాయి. అలాంటిది పాకిస్తాన్లో ఇంతవరకు ఆ తరహా సేవలు లేవు. పైగా ఉన్న సేవలలో కూడా విపరీతమైన అంతరాయం.. ఇవన్నీ భరించి మైక్రోసాఫ్ట్.. ఇక తట్టుకోలేక బయటకు వచ్చేసింది. పాకిస్తాన్ మారకానికి అంతర్జాతీయంగా డిమాండ్ లేకపోవడం.. పైగా పాకిస్తాన్ కరెన్సీ విలువ అంతకంతకు కోల్పోవడం.. డాలర్ నిల్వలు లేకపోవడంతో మైక్రోసాఫ్ట్ బయటకు వచ్చేసింది. త్వరలోనే మైక్రోసాఫ్ట్ తన ఆస్తులను స్థానిక కంపెనీలకు విక్రయించనుంది. బిల్ గేట్స్ సొంత సంస్థ మాత్రమే కాదు.. ఇతర ఏ కార్పొరేట్ కంపెనీ కూడా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే పరిస్థితులు లేవు.
Also Read:ఆ రాత్రి అద్భుతం జరిగింది.. ఒక్క కుక్క అరుఫు 65 మంది ప్రాణాలను కాపాడింది..
ఒకవేళ ఏమైనా కంపెనీలు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేయకుండా బయటికి వస్తే.. తమ ఆస్తులను స్థానికంగా ఉన్న కంపెనీలకు విక్రయిస్తే.. ఆ డబ్బులు అంత ఈజీగా అమ్మిన కంపెనీల ఖాతాలో జమ కావు. ఎందుకంటే పాకిస్తాన్ దేశంలో విదేశీ మారకద్రవ్యం కొరత తీవ్రంగా ఉంది. పాకిస్తాన్ కరెన్సీతో డాలర్లు కొనుగోలు చేసి.. ఆ డాలర్లను కంపెనీల ఖాతాల్లోకి మళ్లించాలంటే చాలా సంవత్సరాల సమయం పడుతున్నది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ నుంచి బయటికి వచ్చినప్పటికీ.. ఆ సంస్థ ఆస్తులు కొనుగోలు చేసిన స్థానిక కంపెనీలు.. దానికి తగ్గట్టుగా డబ్బు మైక్రోసాఫ్ట్ కంపెనీకి పంపించాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఉగ్రవాదం.. ఆర్మీ మితిమీరిన జోక్యం.. పట్టులేని పాలకులు.. ఇవన్నీ కూడా పాకిస్తాన్ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. ప్రపంచ దేశాల ముందు చులకన చేస్తున్నాయి.