Nara Lokesh: ఏపీలో కొన్ని నియోజకవర్గాలది ప్రత్యేక ముద్ర. ఇప్పుడు అటువంటి నియోజకవర్గాల జాబితాలో చేరింది మంగళగిరి. మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తుండటమే అందుకు కారణం. ఈ ఎన్నికల్లో 90 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు లోకేష్. గుంటూరు జిల్లాలో మంగళగిరి అతిపెద్ద నియోజకవర్గం. ఓటర్లు ఎక్కువ. కానీ ఈ ఎన్నికల్లో లక్ష డెబ్భై వేలకు పైగా ఓట్లు సాధించారు లోకేష్. నియోజకవర్గం విషయంలో ప్రత్యేక దృష్టితో కొనసాగుతున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంగళగిరి నియోజకవర్గాన్ని విడిచిపెట్టలేదు. వారికోసం ప్రజా దర్బారు నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కార మార్గం చూపిస్తున్నారు. దీంతో మంగళగిరి నియోజకవర్గ ప్రజలు లోకేష్ పట్ల సానుకూలతతో ఉన్నారు. ఇప్పుడు అదే నియోజకవర్గంలో టిడిపి సభ్యత్వ నమోదు లక్షకు దాటడం విశేషం. అయితే దీని వెనుక లోకేష్ కృషి ఉంది. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత్వాలు చేసుకుంటున్నట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి.
* కాంగ్రెస్ కు బలమైన నియోజకవర్గం
వాస్తవానికి మంగళగిరి నియోజకవర్గం కాంగ్రెస్ కు బలమైన నియోజకవర్గం. టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీ గెలిచింది ఒకటి రెండు సార్లు మాత్రమే. ఎన్టీఆర్ ప్రభంజనంలో సైతం అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది. అయితే 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని లోకేష్ ఎంచుకోవడం సాహసం అనే చెప్పాలి. వద్దని చాలామంది వారించారు. కానీ లోకేష్ వినలేదు. ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఓడిపోయిన చోటే వెతుక్కోవడం ప్రారంభించారు. గత ఐదేళ్ల కాలంలో మంగళగిరి నియోజకవర్గాన్ని జల్లెడ పట్టారు. ప్రజలతో మమేకం అయి పని చేశారు. జగన్ ఈ విషయాన్ని గుర్తించి అనేక రకాల ప్రయోగాలు చేశారు. చివరకు ఇద్దరు ఎమ్మెల్యేలతో సంబంధం ఉన్న కుటుంబ సభ్యురాలిని రంగంలోకి దించారు. అయినా సరే లోకేష్ గెలుపును అడ్డుకోలేక పోయారు.
* ఇక శాశ్వతం
కీలక నేతలకు నియోజకవర్గాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కుప్పం కు చంద్రబాబు, పులివెందులకు జగన్ మాదిరిగానే ఇప్పుడు లోకేష్ కు మంగళగిరి మారనుంది. అంతలా అక్కడ పట్టు సాధిస్తున్నారు లోకేష్. నియోజకవర్గంలో లక్ష కుటుంబాలను తెలుగుదేశం పార్టీకి చేరువ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. లక్ష రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటే శాశ్వతంగా ఇస్తారని టిడిపి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అలా లక్ష రూపాయలు ఇచ్చి సభ్యత్వం తీసుకున్న వారు సైతం మంగళగిరిలో అధికం. మొత్తానికైతే లోకేష్ సాహసం మంచి ఫలితాలనే ఇస్తుంది. మంగళగిరి నియోజకవర్గాన్ని ఓన్ చేసుకోవడంలో లోకేష్ సక్సెస్ అయినట్లు విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.