Pawan Kalyan: అల్లు అర్జున్ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు స్పందించారు. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన, రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం, సినీ పరిశ్రమల నుంచి వచ్చిన కామెంట్స్ పై తాజాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ ఎపిసోడ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు బాధ్యుడిని చేస్తూ అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన సంగతి విధితమే. ఆ సమయంలో మెగా కుటుంబం అల్లు అర్జున్ కు అండగా నిలబడింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా బ్రదర్ నాగబాబు అల్లు అర్జున్ ను పరామర్శించారు. అదే సమయంలో తనకు అండగా నిలిచినందుకు అల్లు అర్జున్ చిరంజీవితో పాటు నాగబాబు ఇంటికి వెళ్లి మరీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలుస్తారని ప్రచారం జరిగింది. కానీ పవన్ నుంచి అనుమతి రాలేదని సోషల్ మీడియాలో టాక్ నడిచింది. అయితే ఈ ఇష్యూ పై ఇంతవరకు పవన్ కళ్యాణ్ మాట్లాడింది లేదు. కానీ తాజాగా నోరు తెరిచారు.
* తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో
మొత్తం ఈ ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రీమియర్ షోల ప్రదర్శన, టికెట్ల ధర పెంపు ఉండదని తేల్చి చెప్పింది. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైంది చిత్ర పరిశ్రమ. ఈ విషయంలో పునరాలోచన చేయాలని సినీ పెద్దలు రేవంత్ రెడ్డిని కలిసి కోరారు. అయితే సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనిస్తుందని.. కానీ టిక్కెట్ల ధర పెంపుతో పాటు ప్రీమియర్ షో ల ప్రదర్శన విషయంలో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పారు. ఇటువంటి తరుణంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తాజా పరిస్థితులపై స్పందించారు పవన్ కళ్యాణ్. కీలక వ్యాఖ్యలు చేశారు.
* అందరి బాధ్యత గుర్తు చేస్తూ
ఈ మొత్తం ఎపిసోడ్లో అల్లు అర్జున్ ను ఒంటరి చేశారని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తీసుకొచ్చారని కూడా వ్యాఖ్యానించారు. అయితే ఒక హీరోను అరెస్టు చేసి రేవంత్ రెడ్డి తన పాలనలో పారదర్శకత చూపించారని కూడా కామెంట్స్ చేశారు. అదే రేవంత్ రెడ్డి పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షోల ప్రదర్శనతో పాటు టికెట్ల ధర పెంపునకు అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అది చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమేనని వ్యాఖ్యానించారు. రేవంత్ గురించి ప్రస్తావించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రచారం జరగడం దారుణమన్నారు. ఆ స్థాయిని రేవంత్ ఎప్పుడో దాటేశారని.. ఎవరు గుర్తించాల్సిన పని లేదని కూడా తేల్చి చెప్పారు. మొత్తానికైతే పవన్ కామెంట్స్ సూటిగా, సుత్తి లేకుండా సాగడం విశేషం.