Osamu Suzuki : సుజుకి మోటార్ కార్పొరేషన్ మాజీ ప్రెసిడెంట్, సీఈవో అయిన ఒసాము సుజుకీ (94) బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణానికి కారణం ప్రాణాంతక లింఫోమా అని తెలుస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ శుక్రవారం వెల్లడించింది. సుజుకీ నాలుగు దశాబ్దాల పాటు కంపెనీని విజయ పథంలో నడిపించాడు. సుజుకీని గ్లోబల్ కంపెనీగా తీర్చిదిద్దాడు. భారతదేశంలో సుజుకీని పటిష్టం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఒసాము 91 సంవత్సరాల వయస్సులో 1978 నుండి 2021 వరకు సుజుకి కంపెనీకి ప్రెసిడెంట్, ఛైర్మన్, సీఈవోగా బాధ్యతలు నెరవేర్చారు. ఆయన నాయకత్వలో కంపెనీ అమ్మకాలు 300 బిలియన్ యెన్ ($1.9 బిలియన్) నుండి 3 ట్రిలియన్ యెన్‌లకు పెరిగాయి. ఈ పదిరెట్లు పెరగడం ఆయన దూరదృష్టికి నిదర్శనం.
ఒసాము సుజుకి జనవరి 30, 1930న జపాన్‌లోని గిఫు ప్రిఫెక్చర్‌లో జన్మించాడు. 1958లో సుజుకీ కుటుంబానికి చెందిన కుమార్తెను వివాహం చేసుకున్న తర్వాత సుజుకి మోటార్ కంపెనీలో చేరారు. అతను తన భార్య ఇంటి పేరు ‘సుజుకి’ని స్వీకరించాడు. అతని భార్య అప్పటి ఛైర్మన్ షుంజో సుజుకి కుమార్తె. 1978లో కంపెనీ అధ్యక్షుడయ్యాడు. అతను 1920లో సుజుకి లూమ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీగా ప్రారంభించి జపాన్‌లోని ప్రముఖ ఆటోమేకర్‌లలో ఒకటిగా నిర్మించాడు.
ప్రధాని మోదీ సంతాపం
ఒసాము సుజుకీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. అని పీఎం సోషల్ మీడియా వేదికగా రాశారు అతని దూరదృష్టి.. ప్రపంచ అవగాహనను పునర్నిర్మించింది. తన నాయకత్వంలో సుజుకి మోటార్ కార్పోరేషన్ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంటూ గ్లోబల్ పవర్‌హౌస్‌గా మారింది. తన ఆవిష్కరణలు కంపెనీని విస్తారంగా ముందుకు తీసుకెళ్లాయి. తనుకు భారతదేశంపై గాఢమైన ప్రేమ ఉండేది. మారుతితో అతని సహకారం భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందంటూ రాసుకొచ్చారు.
Deeply saddened by the passing of Mr. Osamu Suzuki, a legendary figure in the global automotive industry. His visionary work reshaped global perceptions of mobility. Under his leadership, Suzuki Motor Corporation became a global powerhouse, successfully navigating challenges,… pic.twitter.com/MjXmYaEOYA
— Narendra Modi (@narendramodi) December 27, 2024
భారత మార్కెట్‌పై దృష్టి
చాలా మంది జపనీస్ ఆటో తయారీదారులు అమెరికా, చైనా మార్కెట్లపై దృష్టి సారించగా, సుజుకి భారతదేశం, ఆగ్నేయాసియా, హంగేరి వంటి ప్రాంతాలలో చిన్న, మీడియం కార్లను ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించింది. ఈ వ్యూహం మార్కెట్లలో కంపెనీని విజయ తీరాలకు చేర్చింది. అయితే, పెద్ద వాహనాలకు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, సుజుకి మోటార్ 2012లో అమెరికా ఆటోమొబైల్ మార్కెట్ నుండి, 2018లో చైనా నుండి నిష్క్రమించింది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, కంపెనీ ఇతర కీలక రంగాల్లో తన పట్టును కొనసాగించింది, ఒసాము సుజుకి నాయకత్వంలో కంపెనీ అభివృద్ధి చెందింది.
అనేక కంపెనీలతో భాగస్వామ్యం
సుజుకి మోటార్ 2009లో దాని సాంకేతికతలను మెరుగుపరచడానికి వోక్స్‌వ్యాగన్ ఏజీతో వ్యాపార కూటమిని ఏర్పాటు చేసింది. అయితే, నియంత్రణపై వివాదాల తర్వాత 2015లో భాగస్వామ్యం విచ్ఛిన్నమైంది. CASE (కనెక్టెడ్, అటానమస్, షేర్డ్ అండ్ ఎలక్ట్రిక్) టెక్నాలజీల పట్ల పరిశ్రమ పెరుగుతున్న ధోరణికి ప్రతిస్పందనగా సుజుకి తరువాత 2019లో టయోటా మోటార్ కార్పొరేషన్‌తో ఒక కూటమిని ఏర్పాటు చేసింది. సెల్ప్ డ్రైవింగ్ వాహనాలను సహ-అభివృద్ధి చేయడం దీని లక్ష్యం.
2021 వరకు చైర్మన్
ఒసాము సుజుకీ 2015లో చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. కంపెనీ పగ్గాలను తన కుమారుడు తోషిహిరో సుజుకీకి అప్పగించారు. కానీ, ఆయన 2021 వరకు కంపెనీకి చైర్మన్‌గా దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. అతని నాయకత్వంలో, సుజుకి మోటార్ అనుబంధ సంస్థ మారుతీ సుజుకి ఇండియా 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత కార్ మార్కెట్‌లో 41.7 శాతం వాటాను కొనసాగించింది. ఇది దాని సమీప పోటీదారు హ్యుందాయ్ మోటార్ కంపెనీ కంటే చాలా ముందుంది. దీని వాటా 14.6 శాతం.